ముంబయి మరోసారి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన .. సూర్యకుమార్ యాదవ్ (79*, 47 బంతుల్లో, 11×4, 2×2) అజేయ అర్ధశతకంతో రాణించడం వల్ల నాలుగు వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 18.1 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. స్మిత్సేనను తన బౌలింగ్‌తో బుమ్రా (4/20) దెబ్బతీశాడు. బట్లర్ (70; 44 బంతుల్లో, 4×5, 5×6) పోరాటం వృథా అయ్యింది.
ఛేదనలో బట్లర్ మినహా ఎవరూ పోరాడలేకపోయారు. ముంబయి పేసర్ల ధాటికి 12 పరుగులకే రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయింది . జైశ్వాల్, సంజు శాంసన్ డకౌటవ్వగా.. స్మిత్ ఆరు పరుగులకు ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహిపాల్ లొమ్రార్ (11; 13 బంతుల్లో, 1×4)తో కలిసి బట్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే లొమ్రార్‌ను రాహుల్ చాహర్ (1/24) బోల్తా కొట్టించాడు.
అనంతరం బట్లర్ గేర్ మార్చి బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. తొలి 24 బంతుల్లో అతడు 24 పరుగులే చేశాడు. తర్వాత సిక్సర్లతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అయితే పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌కు ప్యాటిన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. ఆఖర్లో ఆర్చర్ (24; 11 బంతుల్లో, 3×4, 1×6) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని తగ్గించాయి. ముంబయి బౌలర్లలో బుమ్రా (4/20), బౌల్ట్ (2/26), ప్యాటిన్సన్ (2/19) రాణించారు.