బెంగళూరు చేతిలో ఘోర పరాభవం చవిచూసిన కోల్‌కతా జట్టు పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. దీంతో 84 పరుగులకే ఆ జట్టు పరిమితమైంది. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లో చేతులెత్తేయడంతో ప్రత్యర్థి చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది.
పవర్‌ప్లేలో అత్యంత పేలవం..
మొదటి ఆరు ఓవర్లు పవర్‌ప్లే. అది బ్యాటింగ్ చేసే జట్టుకు ఒక వరం లాంటింది. కానీ.. అదే సమయంలో వికెట్ కోల్పోయే ప్రమాదాలూ ఉంటాయి. పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించనూ వచ్చు.. వికెట్లూ పడగొట్టొచ్చు. కానీ కోల్‌కతా కథ వేరేలా ఉంది. అటు పరుగు చేయలేక.. ఇటు బౌలింగ్ సమయంలో వికెట్లను పడగొట్టలేక పవర్‌ప్లేను వృథా చేసింది.
పవర్‌ప్లే అనగానే కోల్‌కతా బౌలర్లు వణికిపోతున్నారు. ఆ జట్టు ఆడిన గత ఐదు మ్యాచుల్లో ఈ దశలో ఒక్క వికెట్ కూడా తీయలేదు. పంజాబ్-47/0, బెంగళూరు-47/0, ముంబయి-51/0, హైదరాబాద్-58/0, బెంగళూరు-44/0 ఇలా వికెట్ తీయకుండానే ప్రత్యర్థి జట్లకు పరుగులిచ్చేసింది. పవర్ ప్లేలో ఆ జట్టు బౌలర్లు తీసిన వికెట్లు కేవలం 3. ఈ విషయంలో ముంబయిది అగ్రస్థానం. 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి టాప్‌లో ఉంది. పవర్‌ప్లేలో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన కూడా అలాగే ఉంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఆరు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు సమర్పించుకున్నారు. ఈ టీ20 సీజన్‌లో ఇదే అత్యల్పం. కోల్‌కతాకు మాత్రం ఆల్‌టైం చెత్త రికార్డు ఇది. 2009లో హైదరాబాద్-21/3, 2010లో చెన్నై-22/4, 2014లో పంజాబ్-24/3 పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి.
అన్ని ఓవర్లూ ఆడి.. అత్యల్ప స్కోరు చేసి..