అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ తుదిపోరుకు అంతా సిద్ధమైంది. అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీని అందుకున్న ముంబయి ఇండియన్స్.. తొలిసారి ఫైనల్స్‌కు చేరిన దిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కప్ నీదా నాదా అంటూ సాగే ఈ సమరంలో గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో బరిలో దిగనున్నాయి. మరి విజేతగా నిలిచేది ఎవరో?
ఐదోసారి ఎగరేసుకుపోయేందుకు
ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్లో అదరగొట్టింది. ఆడిన 15 మ్యాచుల్లో 10 గెలిచింది. జట్టులోని ఆటగాళ్లంతా కలిసి 130 సిక్స్‌లు బాదారు. డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పొలార్డ్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఆల్‌రౌండర్లు పాండ్య బ్రదర్స్ జట్టుకు బాగానే సహకరిస్తున్నారు. బౌలర్లలో బుమ్రా, బౌల్ట్, చాహర్ అద్భుతంగా రాణిస్తున్నారు. మొత్తంగా జట్టు ఫుల్‌ఫామ్‌లో ఉంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఐదోసారి కప్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.
అద్భుతం చేస్తారా?
లీగ్ చరిత్రలోనే తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది దిల్లీ క్యాపిటల్స్. అలాగే ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. క్వాలిఫయర్-1లో ముంబయిపైనే ఓడినా సరే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. ధావన్, స్టోయినిస్, హెట్మెయిర్ విజయంలో కీలకపాత్ర పోషించారు. సారథి శ్రేయస్, పంత్ తడబడ్డారు. వారిద్దరూ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. బౌలర్లలో రబాడ(4), స్టోయినిస్(3) బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. వీరికి అశ్విన్, అన్రిచ్, అక్షర్ పటేల్ సహకారమందిస్తే తిరుగే ఉండదు. ఏదేమైనప్పటకీ జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయాన్ని అందుకుంటుంది.
దిల్లీ: శిఖర్ ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్ (సారథి), పంత్, హెట్మెయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, ప్రవీణ్ దూబే, రబాడ, అన్రిచ్
ముంబయి:రోహిత్ శర్మ (సారథి), డికాక్ , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, నాథన్ కౌల్టర్-నైల్, చాహర్, బౌల్ట్, బుమ్రా.
ఇదీ చూడండి : 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్ మాదే'