హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో2 వికెట్ల తేడాతో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్. 163 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన దిల్లీ జట్టులో పృథ్వీ షా(56), రిషభ్ పంత్(49) అదరగొట్టారు. విశాఖ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఆరంభంలో దిల్లీ జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. చివర్లో పంత్ పరాక్రమం చూపాడు. హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్, రషీద్ ఖాన్, భువి చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రిషభ్ పంత్‌కు దక్కింది.
ఈ ఓటమితో సన్‌రైజర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నెల 10న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ.. హైదరాబాద్‌ను 162 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా- ధావన్ 66 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం శిఖర్ ఔటైనా పృథ్వీషా అర్ధశతకంతో రాణించాడు.
పృథ్వీ, పంత్‌ల పరాక్రమం..
ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 56 పరుగులు చేసి దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్ కెరీర్లో మూడో అర్ధశతకాన్ని నమోదు చేసిన పృథ్వీ షా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రిషభ్ పంత్ చివర్లో మెరుపులు మెరిపించాడు. 21 బంతుల్లోనే 49 పరుగులు చేసి దిల్లీ విజయాన్ని ఖాయం చేశాడు.