తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2021, 3:02 PM IST

Updated : Aug 25, 2021, 3:18 PM IST

ETV Bharat / sports

INDvsENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు మూడో టెస్టు జరగబోతుంది. ఈ మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

INDvsENG
భారత్

భారత్‌-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. లీడ్స్ వేదికగా మూడో టెస్టు నేడు (ఆగస్టు 25) జరగబోతుంది. తొలుత ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలో దిగుతోంది. ఇలా జట్టులో మార్పులు లేకుండా బరిలో దిగడం 64 టెస్టుల్లో కోహ్లీకి నాలుగో సారి మాత్రమే.

ఆశ్చర్యంగా ఉంది: కోహ్లీ

టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన కోహ్లీ.. తాను టాస్‌ గెలవడం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపాడు. జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశాడు. అశ్విన్‌ను తీసుకోవాలని భావించినా స్థానిక పరిస్థితుల్లో అదనపు పేసర్‌ ఉండటం ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తుందని వెల్లడించాడు. వికెట్‌ను చూస్తుంటే జడేజా ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో మార్క్‌వుడ్‌ స్థానంలో ఓవర్టన్‌, సిబ్లీ స్థానంలో మలన్‌ వచ్చాడు.

జోరు కొనసాగేనా!

తొలి టెస్టులో చేతికి వచ్చిన విజయాన్ని వరుణుడు ఆపినా.. అత్యుత్తమ ఆటతో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ ఆదే జోరు కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ఫామ్‌లో ఉండడం భారత్​కు కలిసొచ్చే అంశం. వీరిద్దరూ శుభారంభం అందిస్తూ.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతున్నారు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డ చెతేశ్వర్ పుజారా, రహానేలు రాణించడం పట్ల జట్టు సంతోషంగా ఉంది. మూడో టెస్టులోనూ వీరు రాణిస్తే తిరుగుండదని భావిస్తోంది. బౌలర్లు బుమ్రా, షమీ సిరాజ్, ఇషాంత్ ఈ మ్యాచ్​లోనూ సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.

35 ఏళ్ల నిరీక్షణ

ఇంగ్లాండ్ గడ్డపై చివరిగా 1986లో భారత్ జట్టు సిరీస్‌లో ఒకటి కన్నా ఎక్కువ టెస్టుల్లో గెలిచింది. ఆ తర్వాత ఈ 35 ఏళ్లుగా కనీసం ఒక్కసారి కూడా రెండు టెస్టులు గెలవలేదు. ఈసారి ఆ నిరీక్షణకు తెరదించాలని టీమ్ఇండియా భావిస్తోంది.

జట్లు

భారత్

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, రిషబ్ పంత్, జడేజా, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, సిరాజ్

ఇంగ్లాండ్

రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, రూట్ (కెప్టెన్), జానీ బెయిర్​స్టో, బట్లర్, మొయిన్ అలీ, సామ్ కరన్, క్రేగ్ ఓవర్టన్, ఒల్లీ రాబిన్సన్, అండర్సన్

ఇవీ చూడండి: IND vs ENG: కోహ్లీ, రూట్​.. ఈ రికార్డులు అందుకుంటారా?

Last Updated : Aug 25, 2021, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details