ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య డే/నైట్ టెస్టు గురువారం జరగనుంది. సొంతగడ్డ, నైపుణ్యమున్న పేసర్లు, పటిష్ఠ బ్యాటింగ్ లైనప్‌తో కంగారులు... కోహ్లీ సేనకు సవాల్ విసురుతున్నారు. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు టీమ్‌ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. రెండో మ్యాచ్ నుంచి జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడైన కోహ్లి దూరమవుతున్నపుడు తొలి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. గత పర్యటనలో దాదాపు ఇదే జట్టుతో చారిత్రక విజయం సాధించిన అనుభవం.. కీలక ఆటగాళ్లకు ఆస్ట్రేలియా గడ్డపై మెరుగైన రికార్డు.. తాజా పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఉత్సాహం.. వార్నర్ లాంటి కీలక ఆటగాడు అందుబాటులో లేక ప్రత్యర్థిలో నెలకొన్న కంగారు.. సిరీస్‌లో శుభారంభం దక్కుతుందన్న ఆశలు రేపుతున్నాయి.
- భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇదే తొలి డేనైట్ టెస్టు.
- ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 2 టెస్టులు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడిన కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం.
- ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్‌ల సంఖ్య 14. 8 సిరీస్‌ల్లో భారత్ నెగ్గగా.. అయిదు సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.
- స్వదేశంలో ఆస్ట్రేలియాకు గత 14 టెస్టుల్లో ఓటమే లేదు. 13 విజయాలు సాధించిన ఆ జట్టు ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.
- భారత్‌పై ఆడిన గత ఎనిమిది టెస్టుల్లో స్మిత్ 7 సెంచరీలు చేశాడు. మొత్తంగా అతను టీమ్‌ఇండియాపై 10 టెస్టుల్లో 84.05 సగటుతో 1429 పరుగులు చేశాడు.
- ఆస్ట్రేలియా ఇప్పటివరకూ ఆడిన ఏడు డేనైట్ టెస్టుల్లోనూ విజయాలు సాధించింది. భారత్ ఇప్పటిదాకా ఒక్క డేనైట్ టెస్టే ఆడింది. గత ఏడాది బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది.
- ఆస్ట్రేలియా ఆడిన ఏడు డేనైట్ మ్యాచ్‌ల్లోనూ జట్టు సభ్యుడైన స్టార్క్.. 13 ఇన్నింగ్స్‌ల్లో 42 వికెట్లు పడగొట్టాడు. సగటు 19.23. డేనైట్ టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుడు అతనే. లైయన్ 14 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. హేజిల్‌వుడ్ 6 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు.
- ఆస్ట్రేలియాతో భారత్ 98 టెస్టులు ఆడింది . 28 మ్యాచ్‌ల్లో గెలిచింది. 42 ఓడిపోయింది. 27 టెస్టులు డ్రా కాగా.. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.