ఇప్పటికే రెండు వరుస ఓటములు, ప్లేయర్లకు గాయాలతో సతమతమవుతున్న టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేకు సిద్ధమైంది. శనివారం ఈ మ్యాచ్ జరగనుంది. నామమాత్రపు మ్యాచ్‌లో గెలిచి క్లీన్‌స్వీప్ కాకుండా పరువు కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో జట్టు బలాబలాలు గురించి మాట్లాడుకుందాం..
బ్యాటింగ్ సంగతికొస్తే ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా వారు రాణించలేకపోతున్నారు. రోహిత్ శర్మ గాయపడటంతో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ గెలుపు బాధ్యత తీసుకోవాలి. కెప్టెన్‌గా వ్యవహరించే కేఎల్ రాహుల్ జట్టు విజయం కోసం కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ తన ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. చివరి వన్డేలో బ్యాటర్లు బాధ్యతతో గెలిపించాలి. అలాగే భారత బౌలర్లు ఇటు బ్యాటింగ్‌లోనూ కాస్త తమ సహకారం అందించాలి. రెండో వన్డేలో సిరాజ్ సింగిల్ తీయడానికే ఇబ్బంది పడాడ్డు. కీలకమైన సమయంలో రెండు ఓవర్లలో ఒక్క పరుగే రావడంతో రోహిత్ పోరాటం వృథా అయింది.
ఇంకా టీ20 ఫార్మాట్‌లోనే.. బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే మనోళ్లు ఇంకా టీ20 ఫార్మాట్ నుంచి బయటపడినట్లు లేదు. తొలి 20 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ప్రత్యర్థి జట్టుకు చెందిన ఐదారు వికెట్లను టపాటపా తీసేస్తారు. అయితే అక్కడ నుంచి పట్టు వదిలేస్తున్నారు. తొలి రెండు వన్డేల్లోనూ ఇలాగే జరిగింది. మొదటి వన్డేలో చివరి వికెట్ తీయడానికి నానా తంటాలు పడిన బౌలర్లు.. ఇక రెండో వన్డేలో అయితే ఏడో స్థానంలో వచ్చిన మెహిదీ హసన్ మిరాజ్‌తో సెంచరీ కొట్టించారు. ప్రత్యర్థి తోకను కత్తిరించడంలో ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా బౌలర్లు రాణించాలి. అలాగే ఫీల్డింగ్‌లోనూ తొలి వన్డే మాదిరిగా కాకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి.