"ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు, మైదానంలో క్రికెట్ ఆడేటప్పుడు హెల్మెట్ తప్పకుండా వినియోగించాలి" అంటున్నారు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్. రోడ్‌సేఫ్టీ సిరీస్‌లో భాగంగా సచిన్ మళ్లీ బ్యాట్ పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారాతో కలిసి ఓ వీడియో చేశారు. ఈ మేరకు ఆ వీడియోను తన ట్విట్టర్లో పంచుకున్నారు.
లారాతో సచిన్ వీడియో.. యూవీ కామెంట్
ద్విచక్రవాహనంపై వెళ్లేటపుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్. ఈ క్రమంలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ లారాతో కలిసి ఓ వీడియో రూపొందించారు. దీనికి యూవీ కామెంట్ చేశారు.
రహదారి భద్రత విషయంలో అజాగ్రత్త పనికిరాదని, హెల్మెట్‌ను తప్పక వాడాలని వాహనదారులకు సూచించారు. కేవలం వాహనాన్ని నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరిస్తే సరిపోదని, వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా ధరించాలని, ఇద్దరి ప్రాణాలూ ముఖ్యమైనవేనని అన్నారు. వీడియోలో భాగస్వామి అయిన లారాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వీరిద్దరూ కలిసి చేసిన ఈ వీడియోను చూసిన యువరాజ్ తనదైన శైలిలో స్పందించారు. "ఆస్కార్ నామినేషన్" అంటూ నవ్వుతున్న ఎమోజీతో సచిన్‌కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
రోడ్ సేఫ్టీపై ఇటీవల సచిన్ మాట్లాడుతూ.. "ఏటా ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 13 లక్షల మంది చనిపోతున్నారు. అందులో 1.5 లక్షల మంది భారత్‌కు చెందినవారే ఉంటున్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల 18-35 ఏళ్ల వయసున్నవారే ఎక్కువగా మరణిస్తున్నారు. అందుకే ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు నడిపేవారు, వెనక కూర్చొనేవారు హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి. కారులో వెళ్తే సీట్ బెల్ట్ కచ్చితంగా పెట్టుకోవాలి. సిగ్నళ్లను దాటేయొద్దు. తప్పు దారిలో పోవద్దు" అని ఆయన సూచించారు.