మరో ఏడు నెలల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు ముందు.. ఇంగ్లాండ్‌తో సిరీస్ సన్నాహకం లాంటిదని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకొని మరిన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ఇండియాకు సూచించాడు.
తొలి మ్యాచ్‌లో ఓడినా అద్భుతంగా పుంజుకుని టెస్టు సిరీస్‌ను సాధించడం టీమ్ఇండియాకు ఇది వరుసగా రెండోసారని లక్ష్మణ్ వెల్లడించాడు. ఈ విజయాలు ఆటగాళ్ల నైపుణ్యానికి, పట్టుదలకు, దృఢ సంకల్పానికి గొప్ప నిదర్శనమని పేర్కొన్నాడు. బయో బబుల్‌లో మానసికంగా కఠిన పరీక్ష ఎదుర్కొంటూ సాగిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం.. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా విఫలం కావడం అర్థం చేసుకోదగినదేనని తెలిపాడు.
"రెండో టెస్టు సమయానికి కోహ్లీ బృందం రేసులోకి వచ్చింది. ఇంగ్లాండ్ చతికిలపడింది. సిరీస్‌ను 3-1తో ఘనంగా ముగించిన టీమ్ఇండియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఇప్పుడు అందరి చూపు పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే. ఎర్ర బంతితో పోల్చుకుంటే తెల్ల బంతితో ఇంగ్లాండ్ జట్టు ప్రమాదకరమైంది. 2015 ప్రపంచకప్‌లో తొలి దశలోనే నిష్క్రమించిన ఇంగ్లాండ్ ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆ జట్టులో ఆఖరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు రాబట్టగలరు. ఈ సవాల్‌ను అధిగమించడంపైనే ప్రస్తుతం భారత దృష్టంతా." అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.