క్రికెట్‌లో ఫార్మాట్లను బట్టి వేర్వేరు కెప్టెన్ల ఎంపిక అనేది భారత క్రికెట్‌కు సరిపోదని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అసలు ఆ వాదనలో అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. ఈ విషయంపై స్పందించాడు.
"ఫార్మాట్లను బట్టి కెప్టెన్ల ఎంపిక అనే వాదనకు ఎలాంటి అర్థంలేదు. టీమ్‌ఇండియాను అద్భుతంగా తీర్చిదిద్దింది విరాట్ కోహ్లీ. ఆటపై అతడికుండే సానుకూల దృక్పథం, పాటించే నైతిక విలువలు ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి నింపాయి. దాంతో టీమ్ఇండియా ఆటగాళ్లు క్రికెట్ పట్ల అంకితభావంతో ఆడుతున్నారు. అలాగే రహానె, పుజారా, రోహిత్, అశ్విన్, ఇషాంత్, బుమ్రాలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు ఒక బృందంలా ఉండటం విరాట్‌కు కలిసొచ్చింది. అయితే, కోహ్లీ లేనప్పుడు.. రోహిత్, రహానె తమ సారథ్య లక్షణాలతో జట్టును ముందుండి విజయపథంలో నడిపించారు. అంటే టీమ్‌ఇండియా నాయకత్వంలో నాణ్యమైన కెప్టెన్లు ఉన్నారని అర్థం"
- వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్
కోహ్లీ సారథ్య బాధ్యతలను భారంగా భావించనంతవరకూ, మూడు ఫార్మాట్లలో బాగా ఆడుతుంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. "ఇంగ్లాండ్‌లో బహుళ సారథ్యం నడుస్తుంది. అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి జోరూట్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యూలర్ ఆటగాడు కాదు. మరొకటి ఇయాన్ మోర్గాన్ టెస్టు క్రికెటర్ కాదు. ఎవరైనా ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడుతూ, అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలి. ఈ విషయంలో టీమ్‌ఇండియాను ఇంగ్లాండ్‌తో పోల్చలేం. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీని కాదని వేరొకరిని కెప్టెన్‌గా చేయాల్సిన అవసరం లేదు" అని లక్ష్మణ్ వెల్లడించాడు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ లేని సమయంలో అజింక్య రహానె జట్టును విజయపథంలో నడిపించాడు. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడిని పూర్తిస్థాయి సారథిగా కొనసాగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి.
అలాగే గతంలో టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలనే వాదనలూ వినిపించాయి. సమయం వచ్చినప్పుడల్లా కోహ్లీ కెప్టెన్సీపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో లక్ష్మణ్ ఈ విధంగా మాట్లాడాడు.
ఇదీ చూడండి:రూమర్లకు చెక్.. సంజనా గణేశన్‌తో బుమ్రా పెళ్లి