కొంత కాలంగా ఫీల్డ్ అంపైర్లు నోబాల్స్‌ను గుర్తించడంలో పదేపదే విఫలమవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించే బాధ్యతను థర్డ్ అంపైర్(టీవీ అంపైర్)కు అప్పగిస్తున్నట్లు గురువారం అధికారిక ప్రకటన చేసింది.
తొలిసారి భారత్‌తోనే...
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్‌లలో దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఫలితంగా శుక్రవారం జరగనున్న మొదటి టీ20 నుంచే ఈ కొత్త నిబంధన అమలు కానుంది. ఈ సిరీస్‌లతో పాటు కొన్ని నెలలు ఈ సాంకేతికతను పరిశీలించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఐసీసీ భావిస్తోంది.
"థర్డ్ అంపైర్... ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను గుర్తించి ఫీల్డ్ అంపైర్‌కు తెలియజేస్తాడు. అతడి అనుమతి లేకుండా ఫీల్డ్ అంపైర్ నోబాల్స్‌ను ప్రకటించకూడదు. ఒకవేళ బ్యాట్స్‌మన్ ఔటైన బంతి నోబాల్ అని థర్డ్ అంపైర్ ప్రకటిస్తే... ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని ఆటగాడిని వెనక్కి పిలవాల్సి ఉంటుంది. ఈ ఒక్క నిబంధన మినహా ఫీల్డ్ అంపైర్‌కు ఉండే విధులు, బాధ్యతలు యథాతథంగా కొనసాగుతాయి".
-- ఐసీసీ
రికార్డు స్థాయిలో...
గత నెలలో బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరిగిన ఓ టెస్టులో ఏకంగా 21 ఫ్రంట్ ఫుట్ నోబాల్స్‌ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేకపోయారు. ఈ అంశంపై భారీగా విమర్శలు వచ్చాయి. ఒక్క క్షణంలో నోబాల్, బాల్ లెంగ్త్, దిశ, ఎల్బీడబ్ల్యూ వంటి పలు అంశాలు పరిశీలించడం కష్టంగా మారిందని అంపైర్లు చెప్పారు. అందుకే ఈ బాధ్యతను థర్డ్ అంపైర్‌కు అప్పగించాలని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.