తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త కెప్టెన్‌.. ట్రోఫీ అందించేనా? - ఐపీఎల్

ఐపీఎల్​ ప్రారంభ సీజన్​లో ఊహించని విధంగా టైటిల్​ను సొంతం చేసుకున్న రాజస్థాన్​ రాయల్స్​.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బ్యాటింగ్​లో గొప్పగా రాణిస్తున్నా.. బౌలింగ్​లో నిలకడ లేమి ఆ జట్టు ప్రధాన సమస్య. ఈ సీజన్​లో ఆసీస్ క్రికెటర్​ స్మిత్​ను వదులుకున్న రాజస్థాన్​.. యువ ఆటగాడు సంజు శాంసన్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ సారైనా ఆ టీమ్​ కప్​ కొడుతుందేమో చూడాలి మరి.

special story on rajasthan royals
కొత్త కెప్టెన్‌.. రాజస్థాన్​కు ట్రోఫీ అందించేనా?

By

Published : Apr 3, 2021, 6:32 AM IST

నూతన సారథి.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్న ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల హిట్టర్లు.. సత్తాచాట గల దేశీయ కుర్రాళ్లు.. వెరసి పూర్తి ఆత్మవిశ్వాసంతో 14వ సీజన్‌కు సిద్ధమవుతోంది.. రాజస్థాన్‌ రాయల్స్‌. 2008లో లీగ్‌ ఆరంభ సీజన్‌లో అంచనాలకు మించి రాణించి టైటిల్‌ సొంతం చేసుకున్న ఆ జట్టు.. తిరిగి మళ్లీ ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ సీజన్‌లోనూ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగుతున్న ఆ జట్టు.. తొలి సీజన్‌ ప్రదర్శనను పునరావృతం చేయగలదా? కొత్త కెప్టెన్‌ జట్టుకు ట్రోఫీ అందించగలడా?

2008 ఐపీఎల్‌లో విజేతగా నిలిచి లీగ్‌లో తన ప్రయాణాన్ని గొప్పగా ప్రారంభించిన రాజస్థాన్‌ రాయల్స్‌ గురించి ఆ తర్వాతి సీజన్లలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 2013, 2015, 2018లో మాత్రమే ప్లేఆఫ్‌ వరకూ వెళ్లగలిగింది. ఇక గత సీజన్‌లో అయితే జట్టు చరిత్రలోనే పేలవంగా తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది. జట్టు బాగానే ఉన్నప్పటికీ.. సమష్టి ప్రదర్శన చేయడంలో విఫలమై అప్రతిష్ఠ మూటగట్టుకుంది. దీంతో నిరుడు సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌ను వదులుకున్న రాజస్థాన్‌.. యువ ఆటగాడు సంజు శాంసన్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. ఈ ఏడాది వేలంలో దూకుడుగా వ్యవహరించిన ఆ జట్టు లీగ్‌ చరిత్రలోనే అత్యధిక ధర.. రూ.16.25 కోట్లతో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసింది. అతను జట్టుకు సమతూకం తెస్తాడని నమ్ముతోంది.

బలాలు..

రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆ జట్టు బ్యాటింగే ప్రధాన బలం. స్మిత్‌ వెళ్లిపోయినప్పటికీ విధ్వంసం సృష్టించగల ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ప్రమాదకర బట్లర్‌, అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలరు. తమ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలింగ్‌ను చిత్తు చేయగలరు. ఇటీవల టీమ్‌ఇండియాతో సిరీస్‌లో వీళ్లు మంచి ప్రదర్శన చేయడం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శాంసన్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రోజున అతనెంతటి విధ్వంసం సృష్టించగలడో అందరికీ తెలిసిందే. గత సీజన్‌లో రేంజ్‌ హిట్టింగ్‌తో అలవోకగా సిక్సర్లు బాదిన అతను.. ఈ సారి కూడా అదే జోరు చూపించాలనే ధ్యేయంతో ఉన్నాడు. జట్టును నడిపించే నాయకుడి పాత్ర పోషించాల్సిన తను.. బ్యాటింగ్‌లో నిలకడ ప్రదర్శిస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు.

మిడిలార్డర్‌లో రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా లాంటి కుర్రాళ్ల మెరుపు విన్యాసాలు గత సీజన్‌లో చూశాం. జట్టుకు అవసరమైన సమయాల్లో వాళ్లు భారీషాట్లతో ఆదుకున్నారు. హిట్టింగ్‌ సామర్థ్యం ఉన్న పేస్‌ ఆల్‌రౌండర్‌ దూబె కూడా ఈ సారి జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ అనుభవం మెండుగా ఉన్న మోరిస్‌ సైతం మ్యాచ్‌ను ముగించే సత్తా ఉన్నవాడే.

బలహీనతలు..

నిలకడలేని బౌలింగ్‌.. ఆ జట్టును కొన్నేళ్ల నుంచి వెంటాడుతున్న సమస్య. బ్యాటింగ్‌లో భారీ స్కోరు సాధించడం.. బౌలింగ్‌ వైఫల్యంతో దాన్ని కాపాడుకోలేకపోవడం ఆ జట్టుకు బలహీనతగా మారింది. గత సీజన్‌లోనూ ఇదే జరిగింది. నిరుడు అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచిన ఆర్చర్‌ ఒక్కడే ప్రభావం చూపగలిగాడు. కానీ గాయానికి శస్త్రచికిత్స కారణంగా అతను ఈ సీజన్‌ మొత్తానికే దూరం కానున్నాడు. అతను లేని లోటంతా మోరిస్‌పైనే పడనుంది. అయితే తరచుగా గాయాల బారిన పడే అతనికి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

మరోవైపు ఈ ఏడాది వేలంలో రూ.కోటి పెట్టి కొనుక్కున్న ముస్తాఫిజుర్‌ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న అతనింకా భారత్‌ చేరుకోలేదు. ఈ పరిస్థితుల్లోనూ దేశీయ పేసర్లనూ నమ్ముకునే అవకాశలు కనిపించడం లేదు. ఉనద్కత్‌ నిలకడలేమి ఆందోళన కలిగించేదే. స్పిన్నర్లు తెవాతియా, శ్రేయస్‌ గోపాల్‌లపై ఆ జట్టు భారీ ఆశలతో ఉంది.

దేశీయ ఆటగాళ్లు:

శాంసన్‌ (కెప్టెన్‌), యశస్వీ జైశ్వాల్‌, అనుజ్‌ రావత్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌ తెవాతియా, జైదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌ సకారియా, మయాంక్‌ మార్కండె, శివమ్‌ దూబె, కరియప్ప, మహిపాల్‌ లామ్రోర్‌, మనన్‌ వోహ్రా, రియాన్‌ పరాగ్‌, కుల్‌దీప్.‌

విదేశీ ఆటగాళ్లు: బట్లర్‌, లివింగ్‌స్టన్‌, మిల్లర్‌, ముస్తాఫిజుర్‌, టై, మోరిస్‌, స్టోక్స్‌.

కీలక ఆటగాళ్లు: శాంసన్‌, బట్లర్‌, స్టోక్స్‌, మోరిస్‌.

ఉత్తమ ప్రదర్శన: 2008లో విజేత.

ఇదీ చదవండి:ధోనీని కలిసిన జడేజా.. ఆసక్తికర ట్వీట్

ABOUT THE AUTHOR

...view details