తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది: అక్తర్

ముంబయి వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్​లో కంగారూ జట్టుకు ఏమాత్రం పోటీ ఇవ్వలేక కోహ్లీసేన చేతులెత్తేసింది. తాజాగా ఈ ఓటమిపై స్పందించిన పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ భారత్ అవమానకర రీతిలో ఓడిపోయిందని అన్నాడు.

Shoaib Akhtar
అక్తర్

By

Published : Jan 16, 2020, 5:47 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘోరపరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై ఓటమిపాలైంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్లు హోరాహోరీగా తలపడతాయని భావించిన సగటు అభిమానికి నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా ఏకపక్షంగా విజయం సాధించి భారత బౌలింగ్‌పై అనుమానాలు రేకెత్తించింది. తాజాగా ఈ ఓటమిపై స్పందించిన పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ భారత్‌ అవమానకర రీతిలో ఓడిపోయిందని అన్నాడు.

"ఈ మ్యాచ్‌లో టాస్‌ ఎంతో కీలకం. భారత్‌ టాస్‌ ఓడి మ్యాచ్‌ను కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌ బాగా ఆడాడు. కోహ్లీ 28వ ఓవర్‌లో రావడమే అర్థం కాలేదు. అక్కడ భాగస్వామ్యాలు నిర్మించినా సరైన పరుగులు రాలేదు. బుమ్రా, షమి ఉన్నా ఎలాంటి ప్రభావం లేకపోయింది. దానికి తోడు స్పిన్నర్లు కూడా తేలిపోయారు. కోహ్లీ అంత లేటుగా రావాల్సింది కాదు. భారత్‌ తమ ప్రదర్శనపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆసీస్‌ టీమిండియాను చుట్టిపడేసింది. వారి బౌలింగ్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఆసీస్‌ టాస్‌ గెలిస్తే భారత్‌ ఇలానే ఆడుతుందా? ఒకవేళ టీమిండియా 3-0తో సిరీస్‌ కోల్పోతే అది ఎంతో అవమానకరం."
-షోయబ్ అక్తర్, పాక్ మాజీ పేసర్

"ఈ మ్యాచ్‌లో బాగా ఆడాలనే కసి భారత జట్టులో ఏ సందర్భంలోనూ కనపడలేదు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భారత్‌ ఇకపై ధాటిగా ఆడకపోతే ఓడిపోతూనే ఉంటారు. ఇకనైనా భారత్‌ బలంగా పుంజుకుంటుందనే నమ్మకం ఉంది. కోహ్లీసేన ఇప్పటికీ 2-1తో సిరీస్‌ గెలిచే అవకాశం ఉంది. అయితే అది చాలా పెద్ద పని. రెండో మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడాలని ఎదురుచూస్తున్నా" అని అక్తర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి.. సచిన్​, పాంటింగ్ రికార్డులపై కోహ్లీ చూపు

ABOUT THE AUTHOR

...view details