ఖేల్‌రత్న అవార్డుకు సూచించిన వారిలోంచి పంజాబ్ ప్రభుత్వం తన పేరును తొలగించడంపై టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ అవార్డుకు తాను అర్హుడిని కాదని అన్నాడు. గత మూడేళ్లుగా అథ్లెట్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు భజ్జీ వెల్లడించాడు.
"ప్రియమైన మిత్రులారా, ఇటీవలే ఖేల్‌రత్న నామినేషన్ల నుంచి ప్రభుత్వం నా పేరును తొలగించడంపై అనేక పోన్ కాల్స్ వస్తున్నాయి. అసలైన నిజం ఏంటంటే.. నాకు ఆ పురస్కారం పొందే అర్హత లేదు. ఇందులో పంజాబ్ ప్రభుత్వం తప్పు ఎంతమాత్రం లేదు. మీడియాలో ఈ విషయంపై ఎటువంటి పుకార్లు సృష్టించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు."
-హర్భజన్ సింగ్, టీమ్ఇండియా బౌలర్
టీమ్ఇండియా తరఫున ఇప్పటివరకు 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు హర్భజన్. అన్ని ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో 417 వికెట్లు సొంతం చేసుకొని.. భారత్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. 2016 నుంచి జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఎప్పటికైనా మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
2019లో ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్ నామినేషన్‌ను పంజాబ్ క్రీడా మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అందుకు సంబంధించిన పత్రాలు ఆలస్యంగా చేరుకోవడమే కారణమని తెలిపింది. అయితే ఈ ఏడాది మాత్రం తన నామినేషన్‌ను పునఃపరిశీలించాలని మంత్రిత్వ శాఖను కోరాడు భజ్జీ. మూడేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉండటం వల్ల ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదని ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు.
ఇదీ చూడండి:ఆ నిర్ణయం విషయంలో సచిన్‌కు భజ్జీ మద్దతు