తెలంగాణ

telangana

By

Published : Feb 1, 2021, 9:17 PM IST

ETV Bharat / sports

రహానె ప్రశాంతతకు అసలు కారణం ఇదే!

మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్‌ వల్లే యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు టీమ్​ఇండియా క్రికెటర్​ రహానె. ఆసీస్​ సిరీస్​కు వెళ్లేముందు తనకు ద్రవిడ్ ఓ విలువైన సలహా ఇచ్చాడని.. అది ఆ పర్యటనలో తనకు చాలా ఉపయోగపడిందని చెప్పాడు. తాను ప్రశాంత స్వభావంతో ఉండగలగడానికి వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు.

rahaney
రహానె

భారత యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు కారణం రాహుల్​ ద్రవిడేనని టీమ్​ఇండియా క్రికెటర్​ అజింక్యా రహానె కొనియాడాడు. వారు తప్పులు చేస్తే ఆగ్రహించుకోకుండా.. అర్థమయ్యేలా వివరిస్తాడని చెప్పాడు. ఆటగాళ్లకు విలువైన సలహాలు ఇస్తుంటాడని వెల్లడించాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో భాగంగా తొలి మ్యాచు తర్వాత సారథి కోహ్లీ గైర్హాజరయ్యాడు. అప్పుడు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు రహానె. అయితే ఈ సిరీస్​ పర్యటనకు వెళ్లేముందు ద్రవిడ్​ తనకు ఓ విలువైన సలహా ఇచ్చాడని చెప్పాడు. నెట్​ ప్రాక్టీస్​ సెషన్స్​లో ఎక్కువగా బ్యాటింగ్​ చేయొద్దని తనతో చెప్పినట్లు తెలిపాడు. ఆ మాటలకు మొదట తాను ఆశ్చర్యపోయినా.. కానీ అనంతరం ఆ సలహానే తనకు చాలా ఉపయోగపడిందని వెల్లడించాడు. "ఫలితం గురించి ఆశించకుండా నా పని నన్ను చేయమన్నాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలి, ఆటగాళ్లలో ఎలా స్ఫూర్తిని నింపాలి సహా పలు సలహాలు కూడా ఇచ్చాడు. కేవలం వాటిపైనే దృష్టి సారించమన్నాడు. ఈ మాటలన్నీ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి." అని రహానె అన్నాడు.

కాగా, ద్రవిడ్‌ 2016 నుంచి 2019 వరకు అండర్‌-19, ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోనే రిషభ్‌పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైని, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్‌గిల్‌ లాంటి యువకులు మెరుగయ్యారు.

వేదాంత ఫిలాసఫీ వల్లే

సారథి బాధ్యతల్ని ప్రశాంత స్వభావంతో ఎంతో చక్కగా నిర్వర్తించాడంటూ పలువురు మాజీలు, వర్ధమాన క్రికెటెర్లు రహానెను ప్రశంసించారు. అయితే తాను ప్రశాంతంగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు రహానె. వేదాంత ఫిలాసఫీ వల్లే ఈ గుణం తనలో లీనమైపోయిందని అన్నాడు. "గత ఏడేళ్లుగా దీనిని నేను సాధన చేస్తున్నాను. జీవితంలో విజయాల్ని, ఓటములను ఎలా స్వీకరించాలి, జీవితంలో ఏది ముఖ్యం, ఏది కాదు, ఒత్తిడిలో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రశాంత స్వభావంతో ఎలా మెలగాలి ఇలా చాలా విషయాలపై ఈ ఫిలాసఫీ ద్వారానే అవగాహన పెంచుకున్నాను." అని వెల్లడించాడు.

ఇదీ చూడండి: రహానె.. ఆ కేకును ఎందుకు కోయలేదంటే..?

ABOUT THE AUTHOR

...view details