తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ X న్యూజిలాండ్​: 'రా రమ్మని.. తేల్చుకుందామని..' - india vs new zealand 2020

ప్రపంచకప్​లో భారత ఆశలను చిదిమేసిన న్యూజిలాండ్​... కోహ్లీసేనను వాళ్ల దేశానికి ఆహ్వానించింది. మరి వరుస సిరీస్​లతో విజయాల జోరు మీదున్న 'మెన్​ ఇన్​ బ్లూ'... ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సుదీర్ఘ పర్యటనకు ఓకే చెప్పింది. ఇందులో భాగంగా 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టుల కోసం ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి రసవత్తర పోరు ముంగిట పర్యటనపై ఓ లుక్కేద్దామా..

india vs new zealand 2020
భారత్​ X న్యూజిలాండ్​: 'రా రమ్మని.. తేల్చుకుందామని..'

By

Published : Jan 21, 2020, 7:56 AM IST

Updated : Feb 17, 2020, 8:03 PM IST

చుట్టూ కొండలు.. సుందర దృశ్యాలు.. వణికించే చలి.. ఇదీ న్యూజిలాండ్‌ వాతావరణం. ఇక్కడ క్రికెట్‌ ఓ సవాల్‌. స్వింగ్‌, సీమ్‌కు బంతి సలామ్‌ కొట్టే పిచ్‌లపై తేడా వచ్చిందంటే అంత చలిలోనూ చెమటలు పట్టడం ఖాయం. ఇంతటి సవాల్‌తో కూడిన ఈ సిరీస్‌ మరోసారి భారత్‌ను పిలుస్తోంది. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో నాలుగు రోజుల్లోనే కోహ్లీసేన కివీస్​ గడ్డపై ఆడబోతోంది. చాన్నాళ్ల తర్వాత ఓ సుదీర్ఘ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టింది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ జరిగేది శుక్రవారమే.

న్యూజిలాండ్‌.. మనకు ఎప్పుడూ కొరకరాని కొయ్యే! 2009, 2019 సిరీస్‌లను పక్కన పెడితే కివీస్‌లో అడుగుపెట్టి భారత్‌ వన్డే సిరీస్‌ గెలిచిన దాఖలాలు లేవు. 1967లో టెస్టుల్లో 3-1తో గెలిచాక.. 2009లో మళ్లీ అంతే తేడాతో నెగ్గే వరకు భారత్‌ సిరీస్‌ విజయమే ఎరుగదు.. ఇక టీ20ల్లో 5 మ్యాచ్‌ల్లో గెలిచింది ఒక్కటే. న్యూజిలాండ్‌ సిరీస్‌ ఎంత కఠినమో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.

కోహ్లీ-కేన్​ విలియమ్సన్​

చల్లని గాలితో కూడిన వాతావరణం, స్వింగ్‌, సీమ్‌కు కలిసొచ్చే పిచ్‌లు భారత బ్యాట్స్‌మన్‌కు సవాల్‌ విసురుతాయి. ఇలాంటి కఠిన పరిస్థితులను అధిగమిస్తూ 2019లో ఇక్కడ వన్డే సిరీస్‌ను 4-1తో నెగ్గి కివీస్‌కు షాకిచ్చింది కోహ్లీ సేన. కొత్త ఏడాది బలమైన ఆస్ట్రేలియాను ఓడించి వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా.. మరింత ఆత్మవిశ్వాసంతో కేన్​ విలియమ్సన్​ సారథ్యంలోని కివీస్​ను ఢీకొనేందుకు సన్నద్ధమవుతోంది. గతేడాది న్యూజిలాండ్‌లో ప్రదర్శన స్ఫూర్తితో ఐదు టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టుల్లో కివీస్‌ను ఎదుర్కోబోతోంది కోహ్లీ బృందం.

2018లో ఆస్ట్రేలియాపై పూర్తి స్థాయి సిరీస్‌ ఆడిన భారత్‌.. చాలా రోజుల తర్వాత న్యూజిలాండ్‌ రూపంలో మరో సుదీర్ఘ పర్యటనకు బయల్దేరబోతోంది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ కివీస్‌ పేస్‌ బౌలర్లను ఎదుర్కొని భారత్‌ ఈసారి ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

ఇషాంత్‌, ధావన్​ అనుమానం..

కివీస్​ పర్యటన ముందు రంజీ మ్యాచ్​లోసీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ చీలమండలానికి గాయమైంది. వెంటనే మైదానాన్ని వీడిన అతడు మ్యాచ్‌లో మళ్లీ బౌలింగ్‌ చేయలేదు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఫీల్డింగ్​ చేస్తుండగా గాయపడ్డాడు సీనియర్​ ఓపెనర్​ ధావన్. ఇతడి ఎడమ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా వీరిద్దరి ఎంపిక అనుమానంగా మారింది.​

మేము సిద్ధం..

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​పై భారత్​ ఓటమి తర్వాత ఇరజట్లు తలపడుతున్న సిరీస్​ ఇదే. అయితే ఆ టోర్నీకి మించిన ఆత్మవిశ్వాసం, విజయాల జోరుతో పాటు ఫుల్​ ఫామ్​లో ఉన్న కోహ్లీసేన.. కివీస్​ జట్టుకు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఈ సిరీస్​ ముందు మాట్లాడిన కోహ్లీ.. ఏ దేశంలోనైనా, ఎలాంటి ప్రత్యర్థితోనైనా ఆడేందుకు సిద్ధమేనని చెప్పాడు.

" నిరుడు న్యూజిలాండ్‌లో ప్రదర్శన ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఈసారి సానుకూల దృక్పథంతో బరిలో దిగుతున్నాం. ఏం చేయాలి అన్నదానిపై స్పష్టత ఉంది. విదేశాల్లో ఆడినప్పుడు ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టగలిగితే.. ఆ తర్వాత ఆటను ఆస్వాదించొచ్చు. సొంతగడ్డపై ఎలాగైనా గెలవాలన్న భావన ఆతిథ్య జట్టులో ఉంటుంది. అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తే వారిని ఒత్తిడిలో పడేయడం కష్టమేం కాదు. గత పర్యటనలో మేం చేసిందదే. మధ్య ఓవర్లలో వారిని ఆటాడుకున్నాం. స్పిన్నర్లు అసాధారణ ప్రదర్శన చేశారు. ఇప్పుడూ అదే జోరు చూపించాలని అనుకుంటున్నాం. ఆసీస్‌పై గత రెండు వన్డేలూ ఎంతో ఒత్తిడిలో ఆడి గెలిచాం. ఇలాంటి విజయాలే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రపంచకప్‌ నుంచి ఒకే సూత్రం అనుసరిస్తున్నాం. టాస్‌ గెలిస్తే ఫర్వాలేదు.. ఓడినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టాస్‌కు ఎక్కువగా విలువ ఇవ్వకుండా ఆడుతున్నాం. ప్రత్యర్థి ఎలాంటి సవాల్‌ విసిరినా ఎదుర్కొంటున్నాం. మనపై మనకు విశ్వాసం ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి"

- విరాట్‌ కోహ్లి, టీమిండియా కెప్టెన్‌

న్యూజిలాండ్​లో భారత్​ షెడ్యూల్​...

  • టీ20 సిరీస్​...(మధ్యాహ్నం 12.30 నిముషాలకు- భారత కాలమానం ప్రకారం)

తొలి టీ20 >> జనవరి 24 (ఆక్లాండ్​) -

రెండో టీ20 >> జనవరి 26 (ఆక్లాండ్​)

మూడో టీ20 >> జనవరి 29 (హమిల్టన్​)

నాలుగో టీ20 >> జనవరి 31 (వెల్లింగ్టన్​​)

అయిదో టీ20 >> ఫిబ్రవరి 2 (మౌంట్​ మౌంహనుయ్​)

  • వన్డే సిరీస్​..(ఉదయం 7.30 నిముషాలకు- భారత కాలమానం ప్రకారం)

తొలి వన్డే >> ఫిబ్రవరి 5 (హమిల్టన్​)

రెండో వన్డే >> ఫిబ్రవరి 8 (ఆక్లాండ్​​)

మూడో వన్డే >> ఫిబ్రవరి 11 (మౌంట్​ మౌంహనుయ్​)

  • ఫిబ్రవరి 14-16: మూడు రోజుల ప్రాక్టీస్​ సెషన్​, సెడాన్​ పార్క్​(హమిల్టన్​) >> ఉదయం 3.30 నిముషాలకు(భారత కాలమానం ప్రకారం)

టెస్టు సిరీస్​...(ఉదయం 4 గంటలకు- భారత కాలమానం ప్రకారం)

తొలి టెస్టు >> ఫిబ్రవరి 21-25 (వెల్లింగ్టన్​)

రెండో టెస్టు >> ఫిబ్రవరి 29-మార్చి 4 (క్రైస్ట్​చర్చ్​​)

ఇరు జట్లు...

టీమిండియాతో జరిగే ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ సెలక్షన్ కమిటీ. విలియమ్సన్ సారథ్యంలో 14 మంది పేర్లను తెలిపింది. భారత్​ ఇంకా జట్టును ఖరారు చేయలేదు. ఈ టూర్​కు 16 లేదా 17 మందితో జట్టును ప్రకటించాలని చూస్తోంది బీసీసీఐ.

  • న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, కొలిన్ డీ గ్రాండ్​హోమ్, మార్టిన్ గప్తిల్, స్టాట్ కుగ్గెలిజిన్, డారిల్ మిచెల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథి

  • భారత జట్టు అంచనా...

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​శర్మ, కేఎల్​ రాహుల్​, శిఖర్​ ధావన్​, శ్రేయస్​ అయ్యర్​, మనీశ్​ పాండే, రిషభ్​ పంత్​(కీపర్​), శివమ్​ దూబే, కుల్దీప్​ యాదవ్​, యజువేంద్ర చాహల్​, వాషింగ్టన్​ సుందర్​, జస్ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమీ, నవదీప్​ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్​ ఠాకూర్

'ఆల్​రౌండర్'​ కోసం టీమిండియా ఎంపిక ఆలస్యం!

Last Updated : Feb 17, 2020, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details