కోహ్లీసేన ఈనెల 24న న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా 5 టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును ఆదివారం సెలక్టర్లు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే కివీస్ పర్యటనకు భారత జట్టు ఎంపిక ఆలస్యం కానుందని తెలుస్తోంది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే అతడిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో సెలక్టర్లు మరికొన్ని రోజులు ఎంపికను వాయిదా వేయనున్నారని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.
" భారత జట్టు ఎంపికపై పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అయితే హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌తో ఉండటం అవసరం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హార్దిక్ క్రికెట్ ఆడొచ్చని పచ్చజెండా ఊపితే అతడిని ఎంపిక చేస్తాం. అందుకే సెలక్టర్లు మరికొన్ని రోజుల తర్వాత జట్టును ఎంపిక చేస్తారు"
-- బీసీసీఐ అధికారి
ఒకవేళ హార్దిక్ ఫిట్‌నెస్ సాధించలేకపోతే హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను టెస్టులకు కూడా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కివీస్ పిచ్‌ల పరిస్థితిని బట్టి మూడో స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో సైనీని తీసుకుంటారని సమాచారం. 2023 ప్రపంచకప్ ప్రణాళికలో లేని కేదార్ జాదవ్‌ను ఈ పర్యటనకు ఎంపిక చేయకపోవచ్చు.
ఇక జట్టు సమావేశాలకూ సెలక్టర్లు...
ఇక నుంచి సెలక్షన్ కమిటీ అధికారికంగా టీమిండియా జట్టు సమావేశాలకు హాజరు కానుంది. జాతీయ సెలక్టర్ల పదవులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసిన బీసీసీఐ.. అందులో సెలక్టర్లు అవసరమైనప్పుడు జట్టు సమావేశాలకు హాజరు కావాల్సివుంటుందని పేర్కొంది. ఇప్పటివరకు సెలక్టర్లు అధికారికంగా జట్టు సమావేశాలకు హాజరయ్యే వీలు లేదు. సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల స్థానాలను బోర్డు భర్తీ చేయాల్సివుంది. సెలక్టర్ల పదవీకాలం నాలుగేళ్లని ప్రకటనలో బీసీసీఐ చెప్పింది.
ఇదీ చూడండి...భారత్‌తో టీ20లకు న్యూజిలాండ్ జట్టిదే