తెలంగాణ

telangana

ETV Bharat / sports

'త్వరలోనే వన్డేలకు ధోనీ రిటైర్మెంట్' - MS Dhoni may announce retirement soo says ravi shastri

ధోనీ భవిష్యత్తులో జట్టులోకి రావాలంటే ఐపీఎల్ ప్రదర్శనే కొలమానమని తెలిపాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. పంత్​కు మరిన్ని అవకాశాలివ్వాలని అభిప్రాయపడ్డాడు.

MS
ధోనీ

By

Published : Jan 10, 2020, 7:37 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్​ను నిర్ణయించేది ఐపీఎల్ అని స్పష్టం చేశాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ధోనీ బాగా ఆడితే టీ20 ప్రపంచకప్‌నకు పోటీలో ఉంటాడని అన్నాడు. జట్టుకు అతనెప్పుడూ భారంగా మారడని తెలిపాడు.

"మహీతో నేను ఏకాంతంగా సంభాషించాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు. అతనికప్పుడు టీ20లు మాత్రమే మిగిలుంటాయి. అతడు కచ్చితంగా ఐపీఎల్‌ ఆడతాడు. ఒక్కటి మాత్రం నిజం. తనకు తానుగా ధోనీ జట్టుకు భారమవ్వడు. కానీ అతడు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్

ధోనీ, రిషభ్‌ పంత్‌, సంజు శాంసన్‌ను ఎంపిక చేసే విషయంలో మిడిలార్డర్‌లో అనుభవం, ఫామ్‌ కీలకమని రవిశాస్త్రి తెలిపాడు.

"క్రికెటర్‌ ఫామ్‌, అనుభవాన్ని మేం పరిగణనలోకి తీసుకోవాలి. వారు 5-6 స్థానాల్లో బ్యాటింగ్‌ చేస్తారు. ఒకవేళ ఐపీఎల్‌లో ధోనీ బాగా ఆడితే అతడే పోటీలో ఉంటాడు. పంత్‌కు కేవలం 21 ఏళ్లు. ఆ వయసులో శతకాలు బాదిన వికెట్‌ కీపర్లు ఎవరున్నారు? అతడు మరీ ఎక్కువ క్యాచులు వదిలేయలేదు. ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారు. పరిణతి సాధించే కొద్దీ అతడు మెరుగవుతాడు. ఏదైనా సరే రాత్రికి రాత్రే సాధ్యం కాదు. పంత్‌ మ్యాచ్‌ విజేత అనడంలో సందేహం లేదు. అతడికి ప్రతిభ ఉంది. అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. వికెట్‌ కీపింగ్‌ మెరుగు పర్చుకొనేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్

టెస్టులను నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదన మతి లేనిదిగా శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

"ఇలాగే కొనసాగనిస్తే పరిమిత ఓవర్ల టెస్టులు రావొచ్చు. ఐదు రోజుల టెస్టులను మార్చొద్దు. తప్పదంటే టాప్‌-6 జట్లకు ఐదు రోజులు, తర్వాత స్థాయి జట్లకు నాలుగు రోజుల టెస్టులు నిర్వహిస్తే ఫర్వాలేదు. టెస్టులను రక్షించుకోవాలంటే టాప్-6 దేశాలు ఎక్కువగా సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడేలా చూసుకోవాలి."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్

ప్రపంచకప్‌ సెమీస్‌ను చివరి 15 నిమిషాల్లో చేజార్చుకున్నామని తెలిపాడు రవిశాస్త్రి. రాబోయే రెండు సంవత్సరాల్లో టెస్టు ఛాంపియన్‌షిప్‌, రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

ఇవీ చూడండి.. కోహ్లీ చేరువలో మరో ఘనత.. ఒక్క పరుగు దూరంలో

ABOUT THE AUTHOR

...view details