గాయాల పాలైతేనో లేదా ఏదైనా సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటేనో తప్ప క్రికెటర్లు ఆటకు దూరంగా ఉండరు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లందరినీ నెలలకు నెలలు ఇంటి పట్టున ఉండేలా చేసింది కరోనా. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు బ్యాటు, బంతి పట్టే అవకాశమే లేకపోయింది. లాక్‌డౌన్ వల్ల మూణ్నాలుగు నెలలు ఇల్లు దాటి బయటికే రాలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనలు సడలించినా.. ప్రాక్టీస్‌కు బీసీసీఐ అవకాశమివ్వలేదు. భారత్‌లో మ్యాచ్‌లకు అవకాశమే లేకపోవడం వల్ల శిబిరాల్లాంటివేమీ నిర్వహించలేదు.
ఐపీఎల్: నిర్బంధం పూర్తయ్యే.. ప్రాక్టీస్‌కు వేళాయే!
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ముందుగా దుబాయ్ చేరుకున్న జట్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్. బుధవారంతో వారి నిర్బంధాన్ని పూర్తి చేసుకుని ప్రాక్టీస్ కోసం ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టాయి. నేటి నుంచి వీరికి పూర్తిస్థాయిలో నెట్ ప్రాక్టీస్ మొదలవుతుంది.
ఎట్టకేలకు ఐపీఎల్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే నెల 19న మొదలయ్యే టోర్నీ కోసం జట్లన్నీ ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. అక్కడికెళ్లాక ప్రతి జట్టూ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్నది నిబంధన. కాస్త ముందుగా దుబాయ్ చేరుకున్న జట్లు.. బుధవారంతో ఆ ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. గురువారం నుంచే మైదానంలోకి అడుగు పెడుతున్నాయి. ఇప్పటిదాకా హోటళ్లలో వీలున్నంత మేర కసరత్తులు మాత్రమే చేసిన ఆటగాళ్లు.. ఇక క్రికెట్ కిట్లు తీసుకుని సాధనకు సిద్ధమవుతున్నారు. కోహ్లీ జట్టు బెంగళూరు ముందుగా సాధన ఆరంభిస్తున్న జట్లలో ఒకటి.
దుబాయ్ చేరగానే ఖాళీగా ఉండకుండా హోటల్లో కసరత్తులు మొదలుపెట్టాడు విరాట్. ఇప్పుడిక బ్యాటు పట్టి నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. క్వారంటైన్ ప్రక్రియ పూర్తి చేసుకుని, మరోసారి కొవిడ్ పరీక్షలు చేయించుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు.. బుధవారం సాయంత్రమే తేలికపాటి సాధన చేసినట్లు తెలిసింది. గురువారం నుంచి ఈ రెండు జట్ల ఆటగాళ్లు పూర్తి స్థాయిలో నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.