న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీసేన జోరు కొనసాగుతోంది. తొలి టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటిన భారత బ్యాట్స్‌మెన్ రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించారు. కివీస్ విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించారు.
ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో ఆకట్టుకోని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ మ్యాచ్‌లోనూ 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధించారు. కొంతకాలంగా అద్భుత ఫామ్ చూపిస్తోన్న రాహుల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో రెండో అర్ధసెంచరీని నమోదు చేసుకున్నాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయస్ ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాడు. చివర్లో దాటిగా ఆడబోయి 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖరారైపోయింది. చివర్లో దూబే సిక్సుతో మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాగో విజయభేరి మోగించింది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెెండు వికెట్లు సాధించగా.. ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు.