భారత్-శ్రీలంక మధ్య పుణె వేదికగా మూడో టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండోర్ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన బుమ్రా తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని అతను భావిస్తున్నాడు. అటు, పేసర్లు శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ అద్భుతంగా రాణించారు. శార్దూల్ డెత్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. సైనీ కూడా మంచి ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్ వరకూ ఇలాగే రాణిస్తే టీమిండియా పేస్ బౌలింగ్‌కు ఎదురుండదు. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం ఆటగాళ్లు ఉండడం వల్ల కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో రెండో ఓపెనర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, ధావన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీలు రాహుల్ వైపు మొగ్గుచూపుతున్నారు. రాహుల్ కూడా కొంత కాలంగా నిలకడైన ఆటతీరుతో ధావన్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. వెస్టిండీస్ సిరీస్‌లో చెలరేగిన రాహుల్ శ్రీలంకతో రెండో టీ20లోనూ అదరగొట్టాడు. రోహిత్ శర్మ జట్టులోకి వస్తే ధావన్‌ను ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జట్టును చాలా కాలంగా వేధించిన నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కుదురుకున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే ఇండోర్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానంలో వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవాలని అయ్యర్‌ను మూడో స్థానంలో పంపించామంటూ కోహ్లీ చెప్పాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌లో ఇబ్బందిగా మారిన ఆ స్థానంపై దృష్టి సారించేందుకే యాజమాన్యం ఈ తరహా ప్రయోగాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.