గత నెలలో జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. మార్చి 8న తుదిపోరులో టీమిండియా.. కంగారూ జట్టు చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే వీక్షణలో ఈ మ్యాచ్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ పోరును భారత్‌లో టీవీ, డిజిటల్ మాధ్యమాల ద్వారా సుమారు 9.02 మిలియన్ల మంది వీక్షించారని ఐసీసీ గురవారం వెల్లడించింది. నిమిషాల వ్యవధిలో ఈ టోర్నీని, భారత్‌లో 5.4 బిలియన్ల మంది చూసినట్లు ఐసీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే 2019 పురుషుల ప్రపంచకప్ తర్వాత ఇదే అత్యుత్తమం.
గతంతో పోలిస్తే పదుల రెట్లు ఎక్కువగా
ఈ మహిళా ప్రపంచకప్ వీక్షణలు, 2018 వెస్టిండీస్‌లో జరిగిన ఇదే టోర్నీతో పోలిస్తే.. 20 రెట్లు అధికంగా ఉన్నాయి. 2017 ఐసీసీ మహిళా ప్రపంచకప్ కంటే 10 రెట్లు అధికంగా దీనిని వీక్షించారు. హాట్‌స్టార్ ద్వారా భారత్‌లో సుమారు 3.1 మిలియన్ల మంది ఫైనల్ మ్యాచ్ చూశారు.
టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్ చేరిన హర్మన్‌సేన ఆటను దాదాపు 1.78 బిలియన్ల నిమిషాల పాటు వీక్షించారు. ఇది 2018లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తుదిపోరు కంటే 59 రెట్లు అధికం.