ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు మహేంద్రసింగ్ ధోనీ. అప్పటి నుంచి ఏ సిరీస్‌లోనూ పాల్గొనలేదు. మెగాటోర్నీకి ముందు నుంచీ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఫలితంగా ధోనీ తప్పుకోవాలంటూ విమర్శలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల వార్షిక ఒప్పంద జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. ఈ కారణంగా మరోసారి రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ధోనీ చెన్నె సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా ధోనీ జట్టులోకి వచ్చే అవకాశముందని కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. త్వరలోనే వన్డే ఫార్మాట్‌కు మహీ వీడ్కోలు పలుకుతాడని స్పష్టం చేశాడు.
"మహీతో నేను ఏకాంతంగా సంభాషించాను. ఏం మాట్లాడామన్నది మా ఇద్దరి మధ్యే ఉంటుంది. అతడు టెస్టు కెరీర్‌ను ముగించాడు. బహుశా త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెప్పేస్తాడు. అతనికప్పుడు టీ20లు మాత్రమే మిగిలుంటాయి. అతడు కచ్చితంగా ఐపీఎల్ ఆడతాడు. ఒక్కటి మాత్రం నిజం. తనకు తానుగా ధోనీ జట్టుకు భారమవ్వడు. కానీ అతడు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది."
-రవిశాస్త్రి, టీమిండియా కోచ్