కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారిపై జరుగుతున్న పోరుకు దేశ ప్రజలంతా అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పీఎం-కేర్స్ పేరుతో విరాళాలు సేకరించడం కూడా ప్రారంభించారు. ఇప్పటికే భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, మాజీ కెప్టెన్ గంగూలీ, ధోనీ, సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులు తమకు తోచిన మొత్తాన్ని పీఎం-కేర్స్‌కు విరాళంగా అందించారు. తాజాగా వీరి సరసన చేరారు పుజారా, సునీల్ గావస్కర్లు.
వైద్యులు, పోలీసులకు కృతజ్ఞతలు
పీఎం-కేర్స్ ఫండ్‌తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా తాను విరాళం అందిస్తున్నట్లు పుజారా ప్రకటించాడు. అయితే ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నాడనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
'నేను, నా కుటుంబం పీఎం-కేర్స్ ఫండ్, గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధికి.. మాకు తోచిన చిన్న మొత్తాన్ని విరాళంగా అందించాము. మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు నా కృతజ్ఞతలు.' అని పుజారా ట్వీట్ చేశాడు.