బీసీసీఐ సెలక్షన్ కమిటీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ తీవ్ర విమర్శలు చేశాడు. వారిది 'మిక్కీమౌజ్ సెలక్షన్ కమిటీ' అన్నాడు. అందులోని సభ్యులెవరికీ సరైన అర్హతలే లేవని ఆరోపించాడు. జట్టు ఎంపిక, సెలక్టర్లపై సారథి విరాట్ కోహ్లీ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తెలిపాడు. సెలక్టర్లలో ఒకరు.. ఇంగ్లాండ్‌లోని ప్రపంచకప్ మ్యాచ్‌లో కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు టీ కప్పులు అందించడం చూశానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తాజాగా ఈ బాలీవుడ్ నటి స్పందించింది.
ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ మ్యాచ్ వీక్షిస్తోన్న అనుష్కశర్మ, పక్కనే సెలక్టర్లు "నేను 11 ఏళ్లుగా నాపై వచ్చే విమర్శలపై నిశబ్ధంగా ఉంటున్నా. ఎందుకంటే ఇలాంటి వార్తలపై నేను స్పందించాలనుకోను. మీరు (ఫరూఖ్) సెలక్షన్ కమిటీపై విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి.. కానీ మీ వ్యాఖ్యలకు నా పేరును జోడించి.. మీ అభిప్రాయాన్ని సెన్సేషన్ చేయాలనుకోవద్దు. ఇలాంటి వాటిల్లో నా పేరును వాడుకుంటే అస్సలు ఊరుకోను ".
--అనుష్క శర్మ, సినీ నటి
ఫరూఖ్ వ్యాఖ్యలు...
పుణెలోని వెంగ్‌సర్కార్ క్రికెట్ అకాడమీని సందర్శించడానికి వెళ్లిన ఫరూఖ్.. సెలక్షన్ కమిటీ తీరుపై విమర్శలు గుప్పించాడు. "సారథి విరాట్ కోహ్లీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. అది మంచిదే. కానీ సెలక్టర్లకు ఉన్న అర్హతలేంటి? అంతా కలిపి కనీసం 12 టెస్టులైనా ఆడలేదు. ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చిన సెలక్టర్లలో ఒకరిని నేను గుర్తుపట్టలేకపోయా. టీమిండియా బ్లేజర్ ధరించడం వల్ల ఎవరని ప్రశ్నించా. తానో సెలక్టరని చెప్పాడు. వాళ్లంతా చేసింది అక్కడ అనుష్క శర్మకు టీ కప్పులు అందించడం. దిలీప్ వెంగ్‌సర్కార్ స్థాయి వ్యక్తులు సెలక్షన్ కమిటీలో ఉండాలన్నది నా ఉద్దేశం" అని ఫరూఖ్ కఠినంగా మాట్లాడాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో అనుష్కశర్మ
కోహ్లీ, సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెస్కే ప్రసాద్
వీటితో పాటు క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఉపయోగం లేని పరిపాలక కమిటీ అని అన్నాడు ఫరూఖ్. అందులోని సభ్యులకు రూ.3 కోట్లకుపైగా కేటాయించడాన్ని తప్పుబట్టాడు.