ఐపీఎల్ 13వ సీజన్ కోసం యూఏఈ చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆటగాళ్లకు ఇటీవలే శిబిరాన్ని ప్రారంభించింది. ఇందులోని స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తొలిసారి నెట్స్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. సెషన్ ముగింపులో తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడీ మిస్టర్ 360.
ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన 'బోల్డ్ డైరీస్' ఎపిసోడ్లో.. డివిలియర్స్, పార్థివ్ పటేల్, శివం దూబే వంటి ఆటగాళ్లు తమ ప్రాక్టీసును తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్ పూర్తి చేసిన తర్వాత ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు డివిలియర్స్. చాలా కాలం తర్వాత బ్యాట్ పట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపాడు.
"ఇది చాలా బాగుంది. ఇక్కడ ప్రాక్టీసు చేయడం చాలా ఆనందంగా ఉంది. కానీ లైట్లు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. వికెట్ కొంచెం జిడ్డుగా ఉంది. కాబట్టి ఇది చాలా పెద్ద సవాలు. తొలుత నేను బంతిని చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. చివర్లో మాత్రం కొన్ని మంచి షాట్లు ఆడా. అది కూడా ఆనందించే విషయమే. ప్రాక్టీసులో మనం తీవ్రంగా శ్రమించాలి. అదే నేనూ చేస్తా."