Gautam gambhir on kohli: టీమ్‌ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ ఎవరికీ జన్మహక్కు కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల పగ్గాలు వదిలేసిన కోహ్లీ.. తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు.
‘కెప్టెన్సీ అనేది ఎవరికీ జన్మహక్కు కాదు. మహేంద్ర సింగ్ ధోనిలాంటి దిగ్గజ ఆటగాడి నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ కప్పులు గెలుచుకున్న ధోని ఎలాంటి భేషజాలు లేకుండా.. కోహ్లీ సారథ్యంలో ఆడాడు. కోహ్లీ నిర్ణయంతో టాస్ వేయడం, మైదానంలో ఫీల్డర్లను మోహరించే విషయంలో మాత్రమే మార్పు వస్తుంది. అంతకు మించిన పెద్ద మార్పులేం జట్టులో కనిపించవు. అతడిలోని ఉత్సాహం, ఆటపట్ల ఉన్న అంకిత భావంలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే, ఏ ఆటగాడికైనా దేశం కోసం ఆడటం కన్నా మించిన గొప్ప గౌరవం మరొకటి ఉండదు. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు కోసం శ్రమించాడు. విజయం కోసం కలలు కన్నాడు. ప్రస్తుతం అతడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టి.. జట్టు కోసం పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగేవాడు. ప్రస్తుతం కూడా అదే స్థానంలో ఆడతాడు. జట్టులోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా అతడి స్థానంలో ఎలాంటి మార్పూ ఉండదు’ అని గంభీర్ పేర్కొన్నాడు.