Steffan Nero Triple Century: వన్డేల్లో డబుల్ సెంచరీ అంటేనే గగనం. అయితే క్రికెట్‌లో ఏదీ అసాధ్యం కాదంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ ద్విశతకం బాదేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత పలువురు క్రికెటర్లు 200 పరుగుల మైలురాయిని అందుకున్నారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అయితే ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్‌ను అందుకున్నాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264 పరుగులు కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఓ క్రికెటర్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. అది కూడా ఓ అంధ క్రికెటర్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న అంధుల వన్డే క్రికెట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ స్టెఫన్ నీరో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
కామన్‌వెల్త్ బ్యాంక్ అంధుల సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. స్టెఫన్ నీరో ట్రిపుల్ సెంచరీతో 40 ఓవర్లలో ఏకంగా 542 పరుగుల భారీ స్కోర్ చేసింది. 140 బంతుల్లో 309 పరుగులతో అజేయంగా నిలిచాడు స్టెఫన్. ఏకంగా 49 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో 270 పరుగుల భారీ తేడాతో కంగారూ జట్టు గెలిచింది.