ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్చి 17 నుంచి 21 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగే ఈ టోర్నీలో సింధుకు సులువైన డ్రా ఎదురవగా.. సైనాకు క్లిష్టమైన డ్రా పడింది.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సోనియా చియా (మలేసియా)తో ప్రపంచ ఛాంపియన్, ఐదో సీడ్ సింధు తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లోనూ సింధుకు నల్లేరు మీద నడకే! తొలి రెండు రౌండ్లు అధిగమిస్తే క్వార్టర్స్‌లో మూడో సీడ్ అకానె యమగూచి (జపాన్)తో సింధు తలపడొచ్చు.