ఓ వైపు విభిన్న కథలతో హీరోగా రాణిస్తూనే.. మరోవైపు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్నారు నటుడు మంచు విష్ణు(Manchu vishnu). అలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న ఆయన ఇప్పుడు 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. 'ఈటీవీ'లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో విష్ణు చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..
విష్ణు.. ఈ మధ్య మీ పేరు బాగా వినిపిస్తోంది.. ఏంటి సంగతి?
విష్ణు:నేనేం చేశాను. నా పని నేను చేస్తున్నానంతే. శ్రీను వైట్లతో చేస్తున్న సినిమా కోసం ఆయన దగ్గర తిట్లు తింటూనే ఉన్నాను. అది తప్ప ఎందుకు వినిపిస్తోందో మీరే చెప్పాలి.
మీడియా ఆడుకుంటోందిగా..?
విష్ణు:అయితే, నేను అదృష్టవంతుణ్ని అనే చెప్పాలి. అలా అయినా ఏదో కారణంతో నేను వార్తల్లో ఉన్నాను కదా!
తొలి లాక్‌డౌన్ సమయంలో నీ భార్యాబిడ్డలు అమెరికాలో ఉండిపోయారు. నువ్వు అటు వెళ్లలేక, వాళ్లు ఇటు రాలేక చాలా ఇబ్బంది పడ్డారు కదా. ఆ సమయంలో చాలా ఎమోషనల్‌గా ఓ వీడియో పెట్టావు ఎందుకని?
విష్ణు:ఆ సమయంలో నాకు చాలామంది ఫోన్ చేసి ఎలా ఉన్నావ్? ఏంటి? అని అడిగేవారు. అనివార్య కారణాల వల్ల కుటుంబంలో ఒకరికి చాలా పెద్ద క్యాన్సర్ సర్జరీ కోసం సింగపూర్‌కి వెళ్లాల్సి వచ్చింది. నాన్న, అమ్మ, నేను వెనక్కి వచ్చేశాం. భార్య విన్నీ, పిల్లలు అక్కడే ఉన్నారు. నాన్నను ఇక్కడ ఇంట్లో దింపి, నాన్న పుట్టినరోజు(మార్చి 19)ను విద్యానికేతన్‌లో నిర్వహించి.. 21న తిరిగి సింగపూర్ వెళ్లాలి. 23న లేదా 24న విన్నీని, పిల్లల్ని తీసుకురావాలి. సరిగ్గా అదే సమయంలో లాక్‌డౌన్ విధించారు. లక్కీ ఏంటంటే సింగపూర్‌లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, తెలుగు వాళ్లు కొంతమంది ఉన్నారు. మరోవైపు ప్రపంచంలోనే సేఫెస్ట్ దేశాల్లో అదొకటి. దాంతో కాస్త ఓకే అనిపించింది.
అయితే, అక్కడ 15-20 రోజుల తర్వాత పరిస్థితి మారింది. విన్నీకి టెన్షన్ మొదలైంది. కేంద్ర ప్రభుత్వంలో తెలిసినవారిని కొంతమందిని వాకబు చేస్తే.. "లాక్‌డౌన్ మే ఆఖరి వరకు పొడిగించొచ్చు. దానికి తగ్గట్టు సిద్ధంగా ఉండండి.. మాకు ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు" అని చెప్పారు. అప్పుడు నాలో ఆందోళన మొదలైంది. మన దగ్గర ఎంత డబ్బున్నా.. సింగపూర్‌లో ఉండటం అంటే ఖర్చు చాలా ఎక్కువ. అదే సమయంలో మేలో ఒక ఆప్షన్ వచ్చింది. ఏదైనా ఫ్లైట్ బుక్ చేయగలిగితే.. నా కుటుంబాన్ని నేను వెనక్కి తీసుకొచ్చేయొచ్చని తెలిసింది. అప్పుడే నాకో విషయం అర్థం అయ్యింది. వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులు ఉండే కన్నా.. చేతిలో ఒక రూ.20-30 లక్షలు ఉంటే అవి వందల కోట్లతో సమానం అని తెలుసుకున్నాను.
కానీ ఆ సమయంలో నా దగ్గర చేతిలో అవసరమైన డబ్బులు లేకపోవడం, 'మోసగాళ్లు' సినిమాకు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేసి చేతిలో లిక్విడ్ లేకపోవడం వల్ల కుటుంబాన్ని తీసుకురాలేకపోయాను. పాపం విన్నీ రోజూ ఇబ్బంది పడుతూ ఉండేది. తెలిసినవాళ్లు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి "చాలామంది ఇలా ఇతర ప్రాంతాల్లో ఇరుక్కుని ఉన్నారు.. ఏదైనా ఒక ఎంకరేజ్‌మెంట్ వీడియో చెయ్" అని సూచించారు. దాంతో వీడియో రూపంలో నా భావాలను చెప్పాలనుకున్నాను. అలా ఆ వీడియో చిత్రీకరించినప్పుడు మూడు సార్లు ఏడ్చేశాను. ఆ తర్వాత "నేను ఏడవడం ఏంటి.." అనుకుని సముదాయించుకుని వీడియో చేశాను.
అయితే, ఈ విషయంలో నేను చాలామందికి ధన్యవాదాలు చెప్పాలి. గుడ్‌విల్ అంతా ఏదో ఒకరోజు పనికొస్తుందని చాలామంది అంటుంటారు. అది మరోసారి నిజమైంది. ముంబయిలో ఉన్న ఓ ఫ్రెండ్‌కు హోం శాఖలో తెలిసినవారు ఒకరున్నారు. వాళ్లను ఈ వ్యవహారంలో సాయం అడిగాం. వాళ్లు తెలుగువాళ్లు అవ్వడం, అందులోనూ వాళ్లు నాన్నకు అభిమానులు. ఇవన్నీ నాకు బాగా సాయపడ్డాయి. అయితే ఆ సమయంలో ప్రైవేటు ఫ్లైట్స్‌ను అనుమతించలేదు. కేవలం రెస్క్యూ ఫ్లైట్స్‌ను మాత్రమే అనుమతించారు. ఆ సమయంలో సింగపూర్ తెలుగు అసోసియేషన్ వాళ్లను సంప్రదించాను. 'నా కుటుంబం అక్కడ ఉండిపోయింది. కేవలం రెస్క్యూ ఫ్లైట్స్ మాత్రమే అనుమతిస్తామని అంటున్నారు. నేను కావాలంటే ఒక ఫ్లైట్ బుక్ చేస్తాను. ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. నేనే డబ్బులు పెడతాను' అని అడిగాను. ఈ క్రమంలో ఫ్లైట్ ఇవ్వడానికి ఒకరు అనుమతించారు. అయితే హైదరాబాద్‌కు ఫ్లైట్స్ లేవు. ప్రాధాన్యం ప్రకారం అప్పటికి మనకు ఇంకా విమానాలు మొదలవ్వలేదు. దీంతో పరిస్థితి డ్రామాలాగా మారింది.
ఈ సమయంలో అసోసియేషన్ వాళ్లు చాలా సాయం చేశారు. అంతేకాదు నా తోటి నటీనటులు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా పిలుపునకు వాళ్లంతా ముందుకొచ్చారు. మహేశ్‌బాబు, నితిన్, కళ్యాణ్‌రామ్ లాంటివాళ్లను అడిగాను. 'నా ప్రయత్నం వీలైనంత ఎక్కువమందికి చేరాలి. ఈ విషయం ట్వీట్ చేయండి' అని అడిగాను. అంతేకాదు ఈ విషయంలో సోనూ సూద్‌కూ ఫోన్ చేశాను. సాయం చేయాలని అడిగాను. అందువల్ల చాలామందికి అవేర్‌నెస్ పెరిగింది. అప్పుడు కొంతమందిని మాత్రమే సింగపూర్ నుంచి దేశానికి తీసుకురాగలిగాం. ఆ విమానం ఫుల్ అయ్యింది. మిగతావాళ్లు ఇంకా ఉన్నారు. ఆ తర్వాత మరో రెస్క్యూ ఫ్లైట్ కోసం సాయం చేశాను.
అసోసియేషన్లతో విదేశాల్లో చాలామంది సాయం చేస్తుంటారు.
విష్ణు:అసోసియేషన్ల పేరుతో అందరూ సాయం చేయడానికే ఉన్నారా అనేది నా ప్రశ్న. నాకు అర్థం కానిది ఏంటంటే.. 'మనం తెలుగువాళ్లం. అందరం కలిపి ఒకే అసోసియేషన్‌గా ఉంటే సరిపోతుంది కదా' అనిపిస్తుంటుంది. అందరికీ ఒక బలమైన అసోసియేషన్ ఉంటే సరి.
సేమ్ డైలాగ్ వాళ్లు అదే అనుకుంటే.. మన అసోసియేషన్ గురించి?
విష్ణు: మన అసోసియేషన్ టాపిక్ మీరు ఎత్తారు కాబట్టి చెబుతున్నా.. మనం ఒకటిగా ఉన్నాం.
'మీకే ఐకమత్యం లేదు.. మా గురించి మాట్లాడుతున్నారేంటి' అని ఇతర అసోసియేషన్లవాళ్లు అనుకుంటే..?
విష్ణు:దేవుడు ఒక్కడే అని మనుషులం మనమే ఇంకా కచ్చితంగా చెప్పలేం. అలాంటిది ఒక్క హీరో సరిపోతాడా. ఉన్న ఏడు కోట్లు మందికో, పది కోట్ల మందికో 20 మంది హీరోలు మేం ఉన్నాం. వందల కోట్లమందికి ఒక్క దేవుడు సరిపోడు. ఒక్కొక్కరూ ఒక దేవుడిని ఎన్నుకున్నాం. అలాగే నాకు తెలిసి అసోసియేషన్లు కూడా నాలుగైదు ఉన్నాయి. అలాగే మన అసోసియేషన్ కూడా ఐకమత్యంగా ఉంటే.. చాలా బాగుంటుంది.
ఆ ఛైర్‌లో మీరు కూర్చుంటే న్యాయం చేయగలరా?
విష్ణు:ఆ నమ్మకం ఉంది కాబట్టే.. నేను ఈసారి నిలబడుతున్నాను. నాకు తెలిసి ఇండస్ట్రీ ఇప్పటివరకూ డివైడ్ అవ్వలేదు. ఏదో ఐదారుగురు కుప్పిగంతులు వేస్తుంటే.. ఇండస్ట్రీ మొత్తం విడిపోయింది అనడం తప్పు. ఎన్నికల వల్ల విడిపోవడం, విడిపోతాం అనడం సరికాదు. అది అసాధ్యం కూడా. ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే.
మంచు కుటుంబంలో పుట్టినందుకు గర్వపడుతున్నారా? బాధపడుతున్నారా?
విష్ణు:నాకు ఇది ఓ రకంగా ఆశీర్వాదం, మరో విధంగా పెద్ద సవాలు కూడా. నేను ఎంత చేసినా, ఎన్ని హిట్లు ఇచ్చినా అది మా నాన్న కాలి గోటితో సమానం కాదు. ఈ రోజుకీ మా నాన్న 'నేను రెండే రెండు చొక్కాలతో వచ్చాను. కారు షెడ్‌లో పడుకున్నా. ఒక పూట కూడా నేను తినడానికి తిండి దొరికేది కాదు' అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆయన దేశంలోనే లెజెండ్ నటీనటుల్లో ఒకరిగా ఎదిగారు. దేశంలో నటనా రంగంలో 15 -20 మంది లెజెండ్స్ ఉన్నారంటే.. అందులో నాన్న ఒకరు. ఈ మాటను ఎవరూ కాదనలేరు. నటుడిగా, పరోపకారిగా ఆయన ఓ స్థాయిలో నిలిచారు. అలాంటిది నేను ఏం చేస్తే.. ఆయన స్థాయికి చేరగలనా? అది అసాధ్యం. అందుకే నా దారి నేను వెతుక్కోవాలి. కానీ నాన్న ఉన్న రంగంలోనే నేను ఉంటూ, నన్ను నేను నిరూపించుకోవాలి అనుకునేది చాలా పెద్ద ఛాలెంజ్. మోహన్‌బాబు కొడుకుగా నాకు ఒక సినిమానో, రెండు సినిమాలోనో అవకాశం వస్తుంది. దాని తర్వాత నాకు ప్రతిభ ఉంటేనే కెరీర్ ఉంటుంది. లేకపోతే లేదు. టాలెంట్ ఉండబట్టే కదా నేను ఈ షోలో ఉన్నాను.(నవ్వులు)
నాన్న రాగానే లేవటం, గౌరవంగా చేతులు కట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అది నిజమా.. లేక నటనా?
విష్ణు:నాన్నతో నేను, మనోజ్ ఇలానే ఉంటాం. అక్క అయితే వెరీ రిలాక్స్‌డ్. నాన్న వస్తే అక్క లేచి నిలబడదు. కాలి మీద కాలేసుకుని కూర్చుని, సోఫా మీద పడుకోవడం లాంటివి చేస్తుంటుంది. నేను, మనోజ్ అయితే నిద్రలో కూడా నాన్న ఫోన్ చేస్తే లేచి కూర్చుంటాం. మేం పెరిగిన వాతావరణం అలాంటిది. అందరి ఇళ్లలో అలా ఉండదు. రెండోది మనోజ్ విపరీతంగా అల్లరి చేసేవాడు. దెబ్బలు తినేవాడు కూడా. నాకూ మామూలుగా పడేవి కాదు. హ్యాంగర్లు, కర్రలు కూడా విరిగేవి. అక్క చేసిన పనుల్లో మేం పది శాతం చేస్తే చర్మం వలిచేస్తారు నాన్న. మా అక్క ఏమన్నా చేయొచ్చు. ఆవిడకి ఇంట్లో ఏమన్నా చెల్లుతుంది. మాకు అస్సలు చెల్లదు. (మధ్యలో ఆలీ కల్పించుకుంటూ 'కూతురంటే ప్రేమెక్కువ') ‘తండ్రికి కూతురు వీక్‌నెస్ అనేది పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది.
అందుకోసమే పోటీ మీద నలుగురిని కన్నారా? కవలలు కావాలని ప్లాన్ చేసుకొని కన్నారా?
విష్ణు:(నవ్వులు) అది తలరాత. లేదు కావాలని ప్లాన్ చేసింది కాదు. వారసత్వంగా వచ్చింది. విన్నీవాళ్ల తాతగారికి కవలలున్నారు. ఆ తర్వాత మళ్లీ మాకు కవలలు కలిగారు.
అమ్మ ఎలా మీతో ఉంటుంది?
విష్ణు:అమ్మ అందరితో ఒకేలా ఉంటుంది. కానీ మనోజ్ పెట్టే టెన్షన్స్‌కు అమ్మ ఏటా రెండేళ్ల వయసు పెరిగిపోతోంది. మా అమ్మకు వయసైపోడానికి కారణం వాడే.
మీ ముగ్గురిలో ఎవరికి కోపమెక్కువ?
విష్ణు:అక్కకే ఎక్కువ.
మగాడిలా పుట్టాల్సింది. ఆడపిల్లగా పుట్టింది. ఒకవేళ లక్ష్మి నీకన్నా ముందు మగాడిలా పుడితే నీ పరిస్థితి ఏంటి?
విష్ణు:ఆడపిల్లగా పుట్టిందని మా నాన్న ఇంట్లో తేడా చూపించలేదు. చెప్తే కొత్తగా అనిపించొచ్చు కానీ, అక్కకున్న స్వేచ్ఛ నాకు లేదు. బహుశా ఎందులోనూ తేడా ఉండేది కాదు. క్రికెట్‌లో ఒక కెప్టెన్ మాత్రమే ఉండే వీలుంటుంది. మా ఇంట్లో మేమందరం ఒక్కొక్క కెప్టెన్. మేం చెప్పిందే జరగాలని అనుకుంటాం. అందుకే మేం ముగ్గురం కలిసి పని చేయలేదు.
కథ వినేటప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న సినిమాలు ఎన్ని ఉంటాయి?
విష్ణు:సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే తీస్తాం. ఇది మీకు తెలియంది కాదు.
నమ్మకం కథ మీద? లేక దర్శకుడి మీద?
విష్ణు:ముందు కథ. తర్వాతే దర్శకుడు. కొన్ని సార్లు కథ బాగానే ఉంటుంది. కానీ దర్శకుడు మాయ చేస్తాడనే నమ్మకం వారిపైనా కూడా ఉంటుంది. నా జీవితంలో చేసిన పెద్ద తప్పిదాల్లో మంచి దర్శకులను ఎంచుకోకపోవడం ఒకటి. అందుకు నా అవివేకం ఒకటి. రెండోది నేను సెంటిమెంటల్ ఫూల్‌ని. దర్శకుడి ప్రతిభను నమ్మి ఫీల్డ్‌లోకి దిగుతాం. ఆ దర్శకుడు చెడగొడుతున్నాడు అని తెలిసిపోయాక బయటకు రాలేం. అలా మధ్యలోనే సినిమాలు ఆపేయాలనుకుంటే నాలుగు సినిమాలు విడుదలయ్యేవి కావు. అలాంటి సినిమాల్లో 'ఆచారి అమెరికా యాత్ర' యాత్ర ఒకటి. జి.నాగశ్వర్ రెడ్డి నాకు కథ చెప్పినప్పుడు విపరీతంగా నచ్చింది. అమెరికాలో షూటింగ్‌కు వెళ్లాక కథ మారింది. ఇదేదో తేడా కొడుతుందని అందరికీ చెప్పాను. ఆ సినిమాకు డబ్బులు కూడా పెట్టాను. సినిమా పోయింది, డబ్బులు ఎగ్గొట్టారు. ప్రతి హీరో పైకి ఎదగడానికి, కింద పడటాన్ని శుక్రవారం నిర్ణయిస్తుంది. అలా నేను చేసిన పెద్ద మిస్టేక్స్ నాలుగు శుక్రవారాలున్నాయి. జీవితం 360 డిగ్రీలు తిప్పింది. మీ భాషలో చెప్పాలంటే కాయకచోరీ అయిపోయింది.
కలెక్షన్‌కింగ్ అంటారు? అందులో 50 శాతానికి చేరుకోకపోవడానికి కారణం?
విష్ణు:నేను ముందే చెప్పాను కదా. నా కెరీర్‌లో చేసిన పెద్ద తప్పిదం.. సరైన దర్శకులను ఎంచుకోలేకపోవడం.
ఇకముందైనా ఆ జాగ్రత్త తీసుకోబోతున్నావా?
విష్ణు:ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండకుంటే నాకన్న పెద్ద ఫూల్ ఎవరూ ఉండరు. తర్వాత శ్రీనువైట్లతో 'ఢీ అండ్ ఢీ' తీస్తున్నాం. రెండేళ్లుగా అనుకుంటున్న సినిమా అది. త్వరలోనే మొదలుపెట్టబోతున్నాం. క్యాస్టింగ్ ఫన్నీగా ఉంటుంది. ఆ విషయాలు డైరెక్టర్‌గారు చెబితేనే బాగుంటుంది.
విన్నీని మొదటిసారి చూసిందెక్కడ?
విష్ణు:వాళ్లింట్లోనే చూశాను. ఆ అమ్మాయి నవ్వు, ప్రవేశం ద్వారం వద్ద ఆమె నిలబడిన తీరు. ఈ రోజు తలుచుకున్నా, అదంతా నిన్న జరిగినట్లే అనిపిస్తుంది. అదో అందమైన ఫీలింగ్.