చిత్రం: అల్లుడు అదుర్స్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, నభానటేశ్, అను ఇమ్మాన్యుయేల్, సోనూసూద్, ప్రకాశ్ రాజ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్
బ్యానర్: సుమంత్ మూవీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 14-01-2021
హిట్ అందుకోవడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ ఆరంభంలోనే 'అల్లుడు శీను'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన 'స్పీడునోడు', 'సాక్ష్యం', 'కవచం' సినిమాలతో అనుకున్న స్థాయి విజయాలను అందుకోలేకపోయారు. 'రాక్షసుడు'తో మెప్పించినా 'సీత'తో మిశ్రమ స్పందనలు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో ఆయన.. తనకు ఎంతో కలిసి వచ్చిన 'అల్లుడు' టైటిల్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'అల్లుడు అదుర్స్' అంటూ సంక్రాంతి బరిలోకి దిగిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఈ ఏడాది ఆయన విజయాన్ని అందుకున్నారా?
కథేంటంటే:సాయి శ్రీనివాస్ అలియాస్ శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) ఓ చలాకీ కుర్రాడు. తొమ్మిదో తరగతిలోనే వసుంధరను(అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడతాడు. అనుకోని పరిస్థితుల కారణంగా వసుంధర.. శ్రీనును వదిలి వెళ్లిపోతుంది. దీంతో శ్రీనుకు ప్రేమంటే అసహ్యం కలుగుతుంది. జీవితంలో ఎవర్నీ ప్రేమించకూడదు అనుకుంటాడు. కానీ, తొలి చూపులోనే కౌముదితో (నభానటేశ్) ప్రేమలో పడతాడు. పది రోజుల్లో కౌముదిని ప్రేమలోకి దింపుతానని ఆమె తండ్రి జైపాల్ రెడ్డితో (ప్రకాశ్‌రాజ్) ఛాలెంజ్ చేస్తాడు. మరి, శ్రీను.. కౌముది ప్రేమను గెలుచుకున్నాడా? గజ(సోనూసూద్)తో శ్రీనుకు ఉన్న వైరం ఏమిటి? శ్రీను జీవితంలోకి వసుంధర తిరిగి ఎందుకు వచ్చింది? కౌముదికి, వసుంధరకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? అనేదే కథ..!
ఎలా ఉందంటే:తెలుగు చిత్రపరిశ్రమ నుంచి దేనినైనా తప్పించగలం కానీ... రొటీన్ ఫార్ములాను మాత్రం తప్పించలేం. ఒకేలాంటి కథలు, నేపథ్యాలు తీసుకొని సినిమాలు చేస్తూ ఉంటారు అనే అపవాదు తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎప్పటి నుంచో ఉంది. ‘అల్లుడు అదుర్స్’తో మరోసారి దానిని నిజం చేశారు సంతోష్ శ్రీనివాస్. తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ‘కందిరీగ’ కథను అటుఇటు మడతపెట్టి ‘అల్లుడు అదుర్స్’ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హిట్ సినిమా మ్యాజిక్.. మిగిలిన సినిమాలకు వర్కౌట్ చేయాలని చూస్తే ఇబ్బందులు ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే తొలి సినిమా సాధించిన విజయం, తెచ్చుకున్న క్రేజ్ అన్నిసార్లు రావాలని లేదు.
కుర్ర దర్శకులు సినిమాలంటే ఫ్రెష్‌నెస్ కోరుకుంటుంటారు మన ప్రేక్షకులు. అందులోనూ కుర్ర హీరోతో అనేసరికి ఆ అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. దీంతో ‘అల్లుడు అదుర్స్’లో ఏదో కొత్తగా చూపిస్తారని చాలామంది థియేటర్లకు వస్తారు. అలాంటప్పుడు మాటలు నుంచి ఫైట్ల వరకు, యాక్టింగ్ నుంచి ట్విస్టుల వరకు ఏవీ కొత్తగా లేకపోతే ఆ సినిమా నుంచి మ్యాజిక్ ఆశించడం కష్టమే. ఈ సినిమా విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఇంటర్వెల్ వరకు నాలుగు లవ్ సీన్లు, మూడు కామెడీ బిట్లతో అలా అలా సాగిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి... మూస ధోరణికి వెళ్లి బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.