తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతివకు 'ఆస్కార'మెక్కడ?

ఎందరో మహిళలు తమలోని సృజనాత్మకతో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించినా ఆస్కార్‌ అవార్డు వారిని వరించట్లేదు. కనీసం నామినేషన్​కూ నోచుకోవడం లేదు. గత 90ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో ఉత్తమ దర్శకత్వం విభాగంలో నామినేషన్​ దక్కించుకుంది ఐదుగురు మహిళలే. వారిలో ఒక్కరికే ఆస్కార్​ పురస్కారం దక్కింది. ఇంతకీ ఆ ఐదుగురు మహిళలు ఎవరు? ఆస్కార్​ ఎవరిని వరించింది? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

By

Published : Mar 8, 2021, 11:25 AM IST

oscar
ఆస్కార్​

సినిమా ప్రపంచం అంటే అదో మాయా లోకం. అలాంటి చోట చాలా రంగాల్లో మాదిరే మొదటి నుంచీ పురుషులదే ఆధిపత్యం. తెరపై నటిగానో, నాయికగానో మెరవాలంటే ఓ మహిళకు సవాలే. ఎన్నో అడ్డంకులు దాటుకుని ముందుకెళ్లాలి. అలాంటి అవరోధాలెన్నో అధిగమించి దశాబ్దాలుగా ఎందరో నటీమణులు ప్రేక్షకుల్ని అలరించారు, అలరిస్తున్నారు. సాధారణంగా సినిమా అనేసరికి మహిళలు తెర ముందే తప్పితే తెర వెనుక విభాగాల్లో కనిపించేది తక్కువే. అందులోనూ అన్ని విభాగాలనూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే కీలకమైన డైరెక్టర్‌ కుర్చీలో కూర్చొన్న మహిళలు తక్కువే. ఒకవేళ ఎవరైన ధైర్యంగా ముందుకొచ్చి పనిచేసినా సరైనా ప్రోత్సాహం దక్కడం లేదు. సినిమా వాళ్లకు ఉత్సాహాన్నిచ్చేది ప్రేక్షకాభిమానం, పురస్కారాలు. సినిమా రంగంలోని ప్రతి వ్యక్తి కోరుకునే గొప్ప పురస్కారం ఆస్కార్‌. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం విషయంలోనూ దశాబ్దాల తరబడి మహిళా దర్శకులకు సరైన రీతిలో న్యాయం జరగడం లేదనేది ఏళ్లతరబడి వినిపిస్తున్న మాట. ఎందరో మహిళలు ముందుకొచ్చి గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కిస్తున్నా ఆస్కార్‌ వేదికపై అవార్డు పొందే అదృష్టమే కాదు కనీసం నామినేషన్‌కూ నోచుకోవడం లేదు. తొంభై ఏళ్లు పైబడిన ఆస్కార్‌ చరిత్రలో ఉత్తమ దర్శకత్వం విభాగంలో ఇప్పటి వరకూ నామినేషన్‌ దక్కించుకుంది ఐదుగురు మహిళలే. వాళ్లలో ఒక్కరికే ఆస్కార్‌ పురస్కారం దక్కింది.

ఆస్కార్​

ఎవరా ఐదుగురు మహిళలలు?

ఆస్కార్‌ వేడుకలు మొదలైన 48 ఏళ్ల తర్వాత తొలిసారి 1977లో ఓ దర్శకురాలు ఉత్తమ దర్శకత్వం విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది. ఆమే లీనా వెర్ట్‌ముల్లర్‌. ఆమె తెరకెక్కించిన ‘సెవెన్‌ బ్యూటీస్‌’ చిత్రానికి ఈ నామినేషన్‌ దక్కింది. కానీ పురస్కారం రాలేదు. మళ్లీ 17 సంవత్సరాల వరకూ అంటే 1994 వరకూ దర్శకత్వం విభాగంలో మహిళ పేరే వినిపించలేదు. ఆ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల కోసం జేన్‌ క్యాంపైన్‌ నామినేషన్‌ దక్కించుకుంది. ఆమె తెరకెక్కించిన 'ది పియానో'కు ఈ గౌరవం లభించింది. ఆ తర్వాత 2004లో సోఫియా కొప్పోల, 2010లో కాతియన్‌ బిగేలో, 2018లో గ్రేటా గెర్వీగ్‌ ఉత్తమ నామినేషన్లు దక్కించుకున్నారు.

ఎవరూ లేరా?

తెరవెనుక ఉండి సినిమా నడిపించే మహిళలే లేరా అంటే ఇన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమలోని సృజనాత్మకతను తెరపై చూపించారు. శభాష్‌ అనిపించుకున్నారు. కానీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ మాత్రం దక్కడం లేదు. "మా సినిమాలేంటో ప్రేక్షకులు చూశారు. కానీ పురస్కారాల విషయంలోనే సరైన గుర్తింపు దక్కడం లేదు. మమ్మల్ని గుర్తిస్తే మరింతమంది ఈ రంగంలోకి వస్తారు"అంటున్నారు పలువురు హాలీవుడ్‌ మహిళా దర్శకులు.

సుధాకొంగర

పసిడి గెలిచింది ఒక్కరే...

ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్‌ ప్రతిమను ముద్దాడిన తొలి వ్యక్తిగా నిలిచింది కాతియన్‌ బిగేలో. ఆమె దర్శకత్వం వహించిన ‘ది హర్ట్‌ లాకర్‌’కు ఈ పురస్కారం లభించింది. ఆమె ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌కు మాజీ భార్య.

2021లో...: 93వ ఆస్కార్‌ పురస్కారాల కోసం పోటీపడనున్న చిత్రాల నంచి మార్చి 15న నామినేషన్‌ దక్కించుకున్న వాటి తుది జాబితా ప్రకటించనున్నారు. ఈ నామినేషన్ల రేసులో తమిళ చిత్రం ‘సురారై పొట్రు’ కూడా ఉంది. ఉత్తమ దర్శకత్వం విభాగంలో దర్శకురాలు సుధా కొంగర అవకాశం దక్కించుకున్నారు. ఆమెతో పాటు మరికొందరూ మహిళలూ నామినేషన్‌ తుది జాబితాలో చోటు కోసం పోటీపడుతున్నారు. ఆ వివరాలివీ..

దర్శకురాలు - సినిమా

ఛ్లోయీ జో - నోమడ్‌ల్యాండ్‌

రెజీనా కింగ్‌ - వన్‌ నైట్‌ ఇన్ మియామీ

ఎలీజా హిట్‌మాన్‌ - నెవ్వర్‌ రేర్లీ సమ్‌టైమ్స్ అల్వేజ్‌

కిట్టీ గ్రీన్‌ - ది అసిస్టెంట్‌

జాస్‌పైన్ -‌ డెక్కర్‌ షిర్లే

సోఫియా కొప్పోల - ఆన్‌ ది రాక్స్

కెల్లీ రిచర్డ్‌ - ఫస్ట్‌ కౌ

మిరిండా జులీ - కాజీల్లోనియర్‌

ఆట్మన్‌ దే - వైల్డ్‌ ఎమ్మా

ఛన్నింగ్‌ గాడ్‌ఫ్రే మిస్‌ - జూన్‌టీన్త్‌

ఇదీ చూడండి: ఆస్కార్​ రేసులో 'సూరారై పొట్రు'.. మార్చి 5 నుంచి ఓటింగ్​

ABOUT THE AUTHOR

...view details