మా సినిమాలో అదే ‘ప్రత్యేకం’ అంటూ దర్శకనిర్మాతలు కొన్ని విషయాల్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. దాన్నే ఎక్కువగా ప్రచారం చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి అంశాల్లో ప్రత్యేక గీతం ప్రథమ స్థానంలో ఉంటుంది. యువతరాన్ని అమితంగా ఆకట్టుకునేది ఇదే. కథలో జోష్ పెంచాలన్న ఆలోచన రాగానే గుర్తుకొచ్చేది అదే. వాణిజ్య సూత్రాల్లో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఆ పాటకి ఉండే క్రేజే వేరు. ఒకప్పుడు ఐటెమ్ గాళ్స్ అని అందులో ఆడిపాడేందుకు ప్రత్యేకమైన తారలు ఉండేవాళ్లు. ఇప్పుడు అగ్ర నాయికలు సైతం ఆ పాటలో ఆడిపాడుతున్నారు. ఆ ఒక్క పాటతోనే బోలెడంత పేరు, పారితోషికాన్ని సంపాదిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకగీతాల సందడి తెలుగులో ఎక్కువగానే కనిపించబోతోంది. పేరున్న నాయికలు ఆ పాటల్లో సందడి చేయబోతున్నారు.
గతంలోలా ఐటెమ్ గీతం, ఐటెమ్ భామలనే పదాలు ఇప్పుడు వినిపించడం లేదు. నాయికలు ఆ పాటల్లో ఆడిపాడటం మొదలుపెట్టాక వాటి ముఖచిత్రమే మారిపోయింది. ఐటెమ్ పాట అని కాకుండా... ప్రత్యేక గీతం అని పిలుస్తున్నారు. ఐటెమ్ భామలంటూ ఇప్పుడు ప్రత్యేకంగా ఎవ్వరూ కనిపించడం లేదు. హీరోయిన్లే వాళ్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. తమన్నా, శ్రుతిహాసన్, కాజల్, పూజాహెగ్డే... ఇలా ప్రముఖ కథానాయికలు కూడా ప్రత్యేక గీతాల్లో ఆడిపాడుతూ అదరగొడుతున్నారు. చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో ఓ ప్రత్యేకగీతం ఉంది. అందులో రెజీనా ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాటని తెరకెక్కించారు. చిరు సినిమాలో ప్రత్యేకగీతం అంటే ఇక అదెంత ప్రత్యేకంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చిత్రం ‘రెడ్’లోనూ అలాంటి జోష్ పెంచే ఓ పాట ఉంది. అందులో హెబ్బా పటేల్ ఆడిపాడింది. రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో వారం రోజులపాటు రాత్రి వేళల్లో ఆ గీతాన్ని తెరకెక్కించారు.