తెలంగాణ

telangana

రక్తంతో అభిమాని లేఖ.. అవాక్కయిన తరుణ్

By

Published : Jan 8, 2020, 2:34 PM IST

Updated : Jan 8, 2020, 5:42 PM IST

తెలుగు సినిమాల్లో లవర్​బాయ్​గా మెప్పించి, హీరోగా అలరించి.. అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న కథానాయకుడు తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.

hero tarun birthday
హీరో తరుణ్ పుట్టినరోజు

'లవర్​బాయ్' అంటే ఇప్పటికీ గుర్తొచ్చే పేరు తరుణ్. తనదైన నటన, స్టైల్​తో అమ్మాయిల కలల రాకుమారుడిగా, వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడీ హీరో. పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించి, 'నువ్వే కావాలి'తో కథానాయకుడిగా మారాడు. అయితే ఒకానొక సందర్భంలో ఓ అమ్మాయి తరుణ్​ కోసం రక్తంతో ప్రేమలేఖ రాసింది. అది చూసి షాకవడం అతడి వంతయింది. విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం ఈరోజు తరుణ్ పుట్టినరోజు.

రెండో తరగతిలోనే బాలనటుడిగా ఎంట్రీ

తరుణ్‌.. మద్రాస్‌లో రెండో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నం 'అంజలి'లో నటించే అవకాశమొచ్చింది. ఒకసారి తరుణ్‌ ఇంటికి ఓ కో-డైరెక్టర్‌ భోజనానికి వచ్చారట. ఆ సమయంలో తరుణ్‌ను అతడు చూసి... మణిరత్నం 'అంజలి' తెరకెక్కిస్తున్నారని, అందులోని ఓ పాత్ర కోసం చిన్న అబ్బాయిని వెతుకుతున్నట్టు తరుణ్‌ తల్లిదండ్రులతో చెప్పారు. చివరికి అలా ఆ పాత్రలో తరుణ్‌ నటించాడు.

ఆ తర్వాత 'దళపతి', 'సూర్య ఐపీఎస్‌', 'పిల్లలు దిద్దిన కాపురం', 'ఆదిత్య 369', 'తేజ', 'మనసు మమత' తదితర సినిమాలలో బాలనటుడిగా అలరించాడు.

'నువ్వే కావాలి'తో హీరోగా ఎంట్రీ

తరుణ్.. 1995లో వచ్చిన 'వజ్రం'లో నటించిన తర్వాత.. చదువు కోసం కొన్నాళ్లు విరామం తీసుకొన్నాడు. అనంతరం 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'అంకుల్‌', 'ప్రియమైన నీకు', 'చిరుజల్లు', 'అదృష్టం', 'నువ్వే నువ్వే', 'నువ్వులేక నేను లేను', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఎలా చెప్పను', 'నీ మనసు నాకు తెలుసు', 'సఖియా', 'సోగ్గాడు', 'ఒక ఊరిలో', 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖ పరిణయం', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'యుద్ధం','వేట', 'ఇది నా లవ్‌ స్టోరీ' చిత్రాల్లో నటించాడు.

'నువ్వే కావాలి' సినిమాలో తరుణ్

తరుణ్​కు అభిమాని రక్త లేఖ

తరుణ్‌కు ఉన్న లవర్‌ బాయ్ ఇమేజ్‌ ఎంత విపరీతమైనది అంటే, ఓసారి ఓ అమ్మాయి తరుణ్‌కు రక్తంతో లేఖ రాసింది. అది చూసి తరుణ్‌ షాకయ్యాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఫోన్‌ నెంబర్‌ తీసుకొని ఆమె తల్లిదండ్రులతో, తల్లి రోజారమణిని మాట్లాడించాడు. ఇష్టం ఉండొచ్చు కానీ, దానికి ఓ హద్దు ఉంటుందని ఆ అభిమానితో రోజారమణి చెప్పారట. తరుణ్‌ వైపు నుంచి వచ్చిన ఈ మాటలను వారు అర్ధం చేసుకొన్నారట.

చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం

ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే 'లవర్‌ బాయ్‌' ఇమేజ్‌ను సంపాదించుకొన్న తరుణ్‌.. కొన్నాళ్ల పాటు వరుస విజయలతో ముందుకు దూసుకుపోయాడు. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్‌ చూశాడు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసం మాత్రం చెదిరిపోలేదని అంటున్నాడు. అలాగే ప్రధాన పాత్రలు కాకుండా వేరే పాత్రలు వస్తే వాటిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నటించనని అంటున్నాడు.

క్రికెట్, సినిమాలలో ఒకటి ఎంచుకోమంటే

క్రికెట్, సినిమాలలో ఓ రంగాన్ని ఎంచుకోమంటే కచ్చితంగా నటననే ఎంచుకుంటానని అంటున్నాడీ హీరో. ఇండస్ట్రీలోకి ఎలాగో వచ్చేశాను కాబట్టి ఇదే తన జీవితం అయిపోయిందని తన మనసులోని మాటను ఓసారి మీడియాతో చెప్పాడు.

Last Updated : Jan 8, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details