'బాహుబలి' సినిమాతో తెలుగు సినీ చరిత్రను మరోస్థాయికి తీసుకెళ్లారు దర్శకరత్న రాజమౌళి. ప్రస్తుతం రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌లతో 'ఆర్‌ఆర్‌ఆర్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా'తో ఆయన పంచుకున్న విశేషాలు మీకోసం...
చిన్నప్పటి నుంచే అలవాటు
లాక్‌డౌన్‌లో ఇంటి పనులు చేస్తున్నారు కదా. మీ ఇంట్లో ఎవరికెక్కువ మార్కులు పడుతుంటాయి?
నాకే (నవ్వుతూ). నేను చేసే పని బాగుంటుందని మా ఆవిడ మెచ్చుకుంటుంది. ఇంటి శుభ్రత విషయంలో మా ఆవిడ ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇంట్లో అందరూ వాటిని అందుకునేలా పనిచేయాల్సిందే.
‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్ వల్ల సినీ ప్రముఖులంతా చీపుర్లు పట్టుకుంటున్నారు కదా?
ఇంటి పనులు చేయడాన్ని నామోషీగా భావించేవాళ్లు ఎక్కువ. ఆడవాళ్లే చేయాలన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఆడా, మగా తేడా లేకుండా... పనుల్లో అందరూ పాలుపంచుకుంటే మంచిదన్నదే ఈసవాల్ ఉద్దేశం. హీరోలు ఇల్లు శుభ్రం చేయడం చూస్తుంటే సరదాగా ఉంది.
చిన్నప్పుడు కూడా ఇంటి పనుల్లో భాగం పంచుకునేవారా?
వంట చేయడం తప్ప అన్నీ చేసేవాణ్ని. కరోనాకి ముందు ఇంటి పనుల్లో సాయం చేసేవాణ్ని కాదు. అంతా తనే చేయడం చూసి ఓ చేయి వేయడం తప్ప, మా ఆవిడ ఎప్పుడూ సాయం అడిగింది లేదు.
అది మన అదృష్టమే
కరోనా వైరస్ అందరినీ ఇళ్లకి పరిమితం చేసింది. ఆ విషయంలో మీ ఆలోచనల్ని పంచుకుంటారా?
జరిగిపోయిన దాని గురించి కాకుండా, భవిష్యత్తుపై దృష్టిపెట్టాలి. ఇకపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరేం చేయాలో ఆలోచించాలి. మొదట్లో ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువగా ఉండేది. ఇప్పుడు స్పష్టత వచ్చిందని చెప్పను కానీ... మన రోగ నిరోధక శక్తో లేక వేసవి ప్రభావమో కానీ మిగతా దేశాలతో పోలిస్తే అంత బీభత్సం ఇక్కడ లేదు. అది మన అదృష్టమే అనుకోవాలి. ఎక్కువమందికి వ్యాప్తి చెందితే మన దేశంలో సమస్య అవుతుంది.
కరోనా తర్వాత కూడా లాక్‌డౌన్ పాటించాలనే వాళ్లు కూడా ఉన్నారు. అలా మీరు ప్రత్యేక నిర్ణయాలేమైనా తీసుకున్నారా?
మేం మొదట్నుంచీ కొన్ని పాటిస్తున్నాం. అవసరానికి తగ్గట్టు ఏడాదికి రెండుసార్లు కేవలం కుటుంబంతోనే గడుపుతుంటా. ‘బాహుబలి’ తర్వాత ఏడాది వరకు ఏ పనీ పెట్టుకోలేదు. నిజంగా ప్రపంచం అంతా హాలీడే తీసుకుంటే బాగుంటుంది. ప్రకృతికి మేలు జరుగుతుంది. ఎవరి జీవితాల్ని వాళ్లు సమీక్షించుకొనే అవకాశం దొరుకుతుంది.
చరణ్ వాయిస్‌తో...
'ఆర్‌ఆర్‌ఆర్', ఎలాంటి సవాళ్లని విసిరింది?
సృజనాత్మకమైన సవాళ్లే ఎక్కువ. నా జీవితంలో ఎదురైన అతి పెద్ద సవాళ్లు 'ఈగ' సినిమాకే. ఎక్కువ ఇబ్బంది పెట్టింది అదే. ఎక్కువ సంతృప్తినిచ్చింది కూడా అదే. మిగతా సినిమాల విషయంలో కథ రాస్తున్నప్పుడు, చర్చల్లోనూ మనసులో ఒక ఇమేజ్ అనుకుంటాం. ఈ విధమైన భావోద్వేగాల్ని, ఇలాంటి సన్నివేశాలతో, నటనతో రాబట్టాలనుకుంటాం. ప్రాక్టికల్‌గా మనం అనుకున్నది తెప్పించడంలో బోలెడన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ చేసే ప్రతి సన్నివేశం, ప్రతి షాట్ ఒక సవాలే. 'ఆర్‌ఆర్‌ఆర్'కి ఎదురైన సవాల్ అంటే కరోనానే.
"కరోనా వల్ల థియేటర్లు బంద్ చేశారు. ఇప్పుడు వినోదానికి ప్రత్యామ్నాయం టీవీలు, ఓటీటీ వేదికలు. కరోనా తర్వాత ఓటీటీ వేదికల్ని లక్ష్యంగా చేసుకుని కంటెంట్ రూపొందుతుంది. ప్రేక్షకులు కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ల అభిరుచులు కూడా మారతాయి. వేరే రకాల భావోద్వేగాలు ఆస్వాదించడం మొదలుపెడతారు. ఈ పరిణామంతో ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా పరిణతి చెందుతారు. చిత్రసీమపై రెండేళ్లుపైనే ఈ ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం."
అల్లూరి టీజర్‌కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. కొమరం భీమ్ టీజర్ చరణ్ వాయిస్‌తోనే వస్తుందా?
అంతే కదండీ. అల్లూరి వాయిస్ ఓవర్ ఇవ్వడం సమస్య కాదు కానీ, ఇంకా భీమ్‌కి సంబంధించి కొన్ని విజువల్స్‌ని షూట్ చేయాల్సి ఉంది. లాక్‌డౌన్ తర్వాత ఎలాంటి అనుమతులు వస్తాయనేది చూసి చిత్రీకరణ చేయాలి. అల్లూరి టీజర్ విడుదలయ్యాక మొట్టమొదట ఫోన్ చేసింది చిరంజీవిగారే. ఆయన ఎంతో ఉత్సాహంగా ఆనందాన్ని పంచుకున్నారు.
కరోనా ప్రభావంతో 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రాజెక్టులో మార్పులేమైనా ఉంటాయా?
అనుమతులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. దాని ప్రకారం షెడ్యూళ్లలో మార్పులే తప్ప, ఫైనల్ ప్రాజెక్టులో మార్పుండదు. చిత్రీకరణ విధానంలో ఉంటాయంతే. ప్రభుత్వ అనుమతులొస్తే తప్ప స్పష్టత రాదు.