అందాల పోటీల్లో అందమొక్కటే ఉంటే సరిపోదు.. సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. 22 దేశాల యువతులతో పోటీపడి కిరీటాన్ని అందుకున్న తెలుగమ్మాయి అక్షరా రెడ్డి.. తను ఇక్కడి వరకు రావడానికి గల కారణాల పంచుకుందిలా..
మన దేశం తరఫున ఈనెల 18న దుబాయ్‌లోని ఫ్యాషన్ రన్‌వే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మిస్ సూపర్ గ్లోబ్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో నేను టైటిల్‌ను గెలుచుకున్నా.22 దేశాల నుంచి వచ్చిన అందమైన, ప్రతిభావంతులైన యువతులతో పోటీపడి కిరీటాన్ని అందుకున్నా. నిర్వాహకులు అడిగిన చివరి ప్రశ్నకు సమాధానంగా నా మాటలో అమ్మ నిలిచింది. ఆమె గౌరీ సుధాకర్ రెడ్డి. ‘ఎవరూ లేని ఎడారికి వెళ్లే అవకాశం వస్తే, నీతో ఎవరిని తీసుకెళతావు’ అని అడిగారు. అమ్మ అని జవాబిచ్చా. ఎందుకంటే నా ప్రపంచమే ఆమె. నేనీ రోజు ఇలా వేదికపై నిలబడటానికి కారణం తనే. ఆమెను సంతోషపెట్టడం నా బాధ్యత. తను నా పక్కన ఉంటే నాకు వేరే ఏదీ అవసరం ఉండదు’ అని చెప్పా. ఈ సమాధానం నన్ను విజేతగా నిలబెట్టింది. అంత పెద్ద వేదికపై తొణక్కుండా సమాధానం చెప్పగల ధైర్యాన్ని ఆమె నాలో నింపింది. ఈ గెలుపు వెనుక అమ్మ ఉంది. ఒత్తిడిలెన్నెదురైనా... నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ... ముందడుగు వేయించింది.
ఇబ్బందులెన్నెదురైనా..
నాన్న సుధాకర్ రెడ్డితో పెళ్లై అమ్మ చెన్నై వచ్చింది. నేను, అన్నయ్య శ్రవణ్‌రెడ్డి పుట్టింది అక్కడే. చిన్నప్పటి నుంచి వీళ్లే నా ప్రపంచం. సంతోషంగా కాలం గడుస్తున్న సమయంలో మా జీవితాల్లో పెద్ద కుదుపు. నాకు 11 ఏళ్లప్పుడు నాన్న గుండెనొప్పితో చనిపోయారు. ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్లనిపించింది. అమ్మ, అన్నయ్య, నేను ఒంటరివాళ్లమయ్యాం. మా బాధ్యతలను అమ్మ తీసుకుంది. కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ, మరోవైపు మా చదువులపై శ్రద్ధ పెట్టింది. బాల్యం నుంచి నాకు మోడలింగ్ అంటే ఇష్టమని తెలిసి అంగీకరించింది. మనసుకు నచ్చింది చేయమని చెబుతుంది. నియమ, నిబద్ధతగా లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణ అవసరమనేది. నాన్న లేకపోవడంతో అమ్మ చాలా ఇబ్బందులుపడింది. మా ముందుకు మాత్రం సమస్యలను తెచ్చేది కాదు. చెన్నైలో ఇంటర్ చదివి, సైకాలజీ జార్జియాలో పూర్తిచేశా.
అర్హత సాధించా..
ఇంటర్‌లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టా. ఇప్పటివరకు 150కి పైగా ర్యాంప్‌వాక్‌లు చేశా. అప్పుడే ‘మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా’ పోటీలకు హాజరయ్యే అవకాశాన్ని పొందా. ఇందులో దాదాపు 40 మందికి పైగా పోటీ పడగా, తమిళనాడు నుంచి ఎంపికై, భారతదేశం తరఫున ‘మిస్ సూపర్ గ్లోబ్ వరల్’్డ పోటీలకు అర్హత సాధించా. ఏడు నెలలపాటు దీని కోసం కష్టపడ్డా. డైటింగ్, వ్యాయామాలతో ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నించా. దుబాయ్‌లోని మారియట్‌లో ఈనెల 18న చివరి పోటీలు జరిగాయి. ఇందుకోసం రెండు వారాలకు ముందుగానే అక్కడకు వెళ్లా. అమ్మ అనారోగ్యంగా ఉండటంతో, ఈసారి ఒంటరిగానే పోటీల్లో పాల్గొన్నా.