ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా సెగ హిందీ చిత్రసీమను తాకింది. ఈ వైరస్ దెబ్బకి ఇప్పటికే కొన్ని థియేటర్లు మూతపడగా.. మరికొన్ని సినిమా ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి 'సూర్యవంశీ' సినిమా చేరింది. మార్చి 24న విడుదలవ్వాల్సిన చిత్రం వాయిదా పడినట్లు అధికారికంగా వెల్లడించింది చిత్రయూనిట్.
"ఎంతగానో శ్రమించి సూర్యవంశీ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా ట్రైలర్నూ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వారి నుంచి మంచి స్పందన లభించింది. అయితే ప్రేక్షకులకు సినిమా త్వరగా అందించాలని ఇంతకాలం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశాం. కానీ దేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటం వల్ల ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. సిని ప్రేక్షకుల ఆరోగ్యం, భద్రత దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా ప్రభావం తగ్గగానే సినిమా విడుదల చేస్తాం. మీ భద్రతే మాకు తొలి ప్రాధాన్యం.. అప్పటివరకు మీ ఉత్సాహాన్ని అలానే ఉంచండి. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించండి. ఆరోగ్యంతో జీవించండి."