తన కుమార్తె సోనాక్షి సిన్హా పట్ల తాను ఎంతో గర్వంగా ఉన్నానని బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా అన్నారు. రామాయణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనంత మాత్రాన ఆమె హిందువు కాకుండా పోదని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఒకప్పటి 'రామాయణం' సీరియల్‌ను మళ్లీ ప్రసారం చేస్తున్నారు. సోనాక్షి మాదిరి రామాయణం గురించి సరైన అవగాహనలేని చాలామంది కోసమే ఈ ధారావాహికను పునఃప్రసారం చేస్తున్నారంటూ నటుడు ముఖేశ్ ఖన్నా.. ఇటీవలే ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన శత్రుఘ్న సిన్హా... ముఖేశ్ ఆరోపణలను తిప్పికొట్టారు. "రామాయణానికి సంబంధించిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం వల్ల ఆమె పట్ల చాలామంది అసంతృప్తితో ఉన్నారని నమ్ముతున్నాను. తన గురించి కామెంట్లు చేసేవారందరూ.. రామాయణంలో నిపుణులని ఎలా చెప్పగలం?" అని సిన్హా అన్నారు.
అనంతరం తన కుమార్తె సోనాక్షి గురించి మాట్లాడుతూ.. "నా ముగ్గురు పిల్లల విషయంలో నేనెంతో గర్వంగా ఉన్నాను. సోనాక్షి తనకు తానుగా స్టార్ అయింది. నా కుమార్తెగా తనను ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు. ఏ తండ్రి అయినా గర్వంగా ఫీల్ అయ్యే కుమార్తె తను. రియాల్టీ షోలో రామాయణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోయినంత మాత్రాన తను ఓ హిందువు కాకుండా పోదు. వేరేవాళ్ల నుంచి సరిఫ్టికేట్ పొందాల్సిన అవసరం తనకు లేదు" అని శత్రుఘ్న సిన్హా చెప్పారు.
గతేడాది జరిగిన అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో రామాయణం గురించి అడిగిన ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఇళ్లకే పరిమితమైన ప్రజల కోసం గత కొన్నిరోజులుగా ఒకప్పటి 'రామాయణం', 'మహాభారతం' సిరీయల్స్‌ను ప్రసారం చేస్తున్నారు.
ఇదీ చూడండి :వీర మహిళలకు నటి ప్రియాంక లక్ష డాలర్లు