బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ (Shahrukh Khan) కథానాయకుడిగా అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి వార్త రాలేదు. కానీ, ముందుగా ఈ ఏడాది వేసవిలోనే చిత్రాన్ని ప్రారంభించాలని అనుకున్నారట. అయితే కరోనా కారణంగానే వాయిదా పడిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఆగస్టులో సెట్స్‌పైకి షారుక్, అట్లీ సినిమా! - షారుక్ ఖాన్ అట్లీ మూవీ ఆగస్టులో
షారుక్ ఖాన్ (Shahrukh Khan), అట్లీ (Atlee Kumar) కాంబోలో సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ చిత్రం గురించి పలు రకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
అట్లీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నారట. చిత్రానికి సంబంధించిన స్క్రిప్టుని కూడా పూర్తి చేసుకున్నారట. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. షారుక్ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నారట. అందులో ఒకటి ఎన్.ఐ.ఏ. అధికారి కాగా మరొకటి గ్యాంగ్‌స్టర్ పాత్ర.
అట్లీ చిత్రాలను గమనిస్తే ఆయన తెరకెక్కించిన 'అదిరింది', 'విజిల్' సినిమాల్లో హీరో విజయ్ తండ్రీకొడుకులుగా కనిపిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పఠాన్'లో (Pathan Movie) షారుక్ ఖాన్ నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా దీపికా (Deepika Padukone) పదుకొణె కనిపించనుండగా, జాన్ అబ్రహం ప్రతినాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. సల్మాన్ ఖాన్(Salman Khan) అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు.