"సినిమా ఐదు నెలల్లో పూర్తయిందంటే.. అదంతా అనిల్ క్రెడిట్టే. నిజానికి ఈ చిత్రం ఓ దశలో ఆగిపోద్దనుకున్నా" అన్నాడు మహేష్‌బాబు. ప్రిన్స్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నాడు మహేష్.
" 'దూకుడు' తర్వాత 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను', 'మహర్షి' ఇలా అన్నీ ఒకే తరహా చిత్రాలు చేసుకుంటూ వచ్చేశా. నిజానికి స్క్రిప్ట్ డిమాండ్ చేయబట్టే ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే ఈసారి కాస్త రూట్ మార్చి 'ఖలేజా', 'దూకుడు'ల తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేద్దామని ఫిక్స్ అయ్యి అనిల్ చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చా. నిజానికి ఈ చిత్రానికి ముందుగా మరో కెమెరామెన్‌ను అనుకున్నాం. కానీ, అనుకోని కారణాల వల్ల ఆయన చెయ్యడం కుదరట్లేదన్నారు. ఈ కారణంగా ఓ దశలో సినిమా ఆగిపోతుందేమోనని భయపడ్డాం. కానీ, రత్నవేలుతో నాకున్న సాన్నిహిత్యంతో ఆయన్ని సంప్రదించా. జర్మనీ నుంచి ఆయనకు ఫోన్ చేసి సినిమా విషయం చెప్పా. ఆయన మరో మాట లేకుండా సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది." - మహేష్ బాబు