బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ రూపొందించిన 'గుంజన్ సక్సేనా' చిత్రంపై స్పందించింది నటి కంగనా రనౌత్. ఈ చిత్ర నిర్మాతపై ఓ కవిత ద్వారా తన భావాన్ని వ్యక్తపరిచింది.
"కరణ్ జోహర్ కోసం ఓ కవిత. మేము జాతీయవాదంపై ఆధారపడతాం. కానీ, దేశభక్తిని చూపించం. పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధం ఆధారంగా నిర్మించిన చిత్రాలతో డబ్బు సంపాదిస్తాం. మేమూ అలాంటి సినిమాలే చేస్తాం. కానీ, ఇందులో భారతీయులు ఇప్పటికీ ప్రతినాయకులే. ఆర్మీలో ప్రస్తుతం థర్డ్ జెండర్ వ్యక్తులూ చేరారు. కరణ్ జోహర్ ఓ సైనికుడు అని మీరు ఎప్పటికి అర్థం చేసుకుంటారు."
-కంగనా రనౌత్ టీమ్ ట్విట్టర్ పోస్ట్ సారాంశం
'గుంజన్ సక్సేనా' చిత్రం గురించి స్పందించిన నటి కంగనా రనౌత్.. "ఈ చిత్రం ఓ సైనికురాలి జీవితం ఆధారంగా రూపొందించినా.. అందులోని సారాంశాన్ని కోల్పోయి చిన్న చిత్రంగా మారింది. భారత్‌ను రక్షించడానికే తాము ఇక్కడ ఉన్నామని ప్రత్యర్థులకు తెలియజేస్తుంది గుంజన్. ఈ సినిమాలో ఆమె సమాన అవకాశాల కోసం పోరాడింది. ఇందులో గుంజన్ పాత్ర గెలిచిందే తప్ప భారతదేశం కాదు" అని ట్వీట్ చేసింది.
మరో ట్వీట్లో.. "ఈ సినిమాలో దేశభక్తి ఏమి ఉంది. ఇందులో 'దేశభక్తి కంటే తాను విమానాన్ని నడపాలన్న కోరిక' అనే డైలాగ్‌ను పాత్రధారి చాలాసార్లు చెప్పింది. ఆమెలోని దేశభక్తే వాయుసేనలో చేరడానికి ప్రేరేపించిందనే దానికి ఎలాంటి ఆధారం లేదు. యూనిఫాంకు అసలైన అర్థాన్ని ఆమె ఎలా తెలుసుకుంది" అని పేర్కొంది నటి కంగనా రనౌత్.
ఈ సినిమాపై నటి కంగనా రనౌత్ కాకుండా మరెంతో మంది సోషల్‌మీడియాలో విరుచుకుపడ్డారు. నిర్మాత కరణ్ జోహర్.. భారత వాయుసేనను అగౌరవపరిచారనే యాష్‌ట్యాగ్‌తో గురువారం పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ చిత్రంలో లింగవివక్ష గురించి చూపించడంపై విమర్శలు ఎదుర్కొంది చిత్రబృందం.