పంజాబ్ సింగర్ దిల్జీత్ దోసంజ్తో ఇటీవలే ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి విమర్శలు లేవనెత్తింది. ఈసారి దిల్జీత్తో పాటు నటి ప్రియాంకా చోప్రాపై కామెంట్ చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేయడాన్ని తప్పుపట్టిన కంగన.. రైతుల చర్యకు కారణం ప్రియాంక, దిల్జీత్లే అని పేర్కొంది.
"దిల్జీత్ దోసంజ్, ప్రియాంకా చోప్రాలాంటి వాళ్లు.. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ చర్యను వారు తప్పు దోవ పట్టిస్తున్నారు. జాతి వ్యతిరేకులు, ఇస్లాం ప్రేమికులు దిల్జీత్, ప్రియాంకలను ప్రోత్సహిస్తున్నారు. ఈ వ్యవసాయ బిల్లులు రైతులకు ఎంత అవసరమో అందరికీ తెలుసు. అయినా అమాయక రైతులను రెచ్చగొట్టి ఆందోళన చేసేందుకు ఉసిగొల్పుతున్నారు. వారి స్వలాభం కోసం భారత్ బంద్ వంటివి చేయాలని రైతులను ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి వాళ్లు జాతీయ వ్యతిరేక వాదులను తయారు చేయడమే లక్ష్యంగా ఉన్నారు. మంచి, చెడు మధ్య జరిగే పోరాటంలో తప్పకుండా మంచే గెలుస్తుంది. జై శ్రీరామ్"
-కంగనా రనౌత్, బాలీవుడ్ నటి.
మరో ట్వీట్లో దిల్జీత్, ప్రియాంకలను ట్యాగ్ చేసిన కంగన.. రైతుల ఆందోళన తమకు నిజంగా బాధ కలిగిస్తే ముందు వ్యవసాయ బిల్లులేంటో తెలుసుకోండి అని విమర్శించింది.