కుర్రకారు హృదయాలను హత్తుకున్న దృశ్యకావ్యం '96'. ఈ సినిమాను 'జాను' పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సమంత, శర్వానంద్ జంటగా నటించారు. ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రవిశేషాలను పంచుకున్నారు హీరోహీరోయిన్లు.
తమిళంలో మంచి విజయం సాధించిన '96' సినిమాను రీమేక్ చేస్తున్నారు కదా.. మరి మీకు ఏమైనా భయం వేసిందా?
సమంత:'96' ఓ క్లాసిక్. ఆ సినిమా చూశాక.. ఇలాంటి క్లాసిక్స్‌ను ఎవరూ టచ్ చేయకూడదని నేనే ట్వీట్ చేశాను. అలాంటి ఒప్పుకొన్నాక చాలా భయం వేసింది. నిద్రపట్టేది కాదు. ఒక్కోసారి మా మేనేజర్‌కు ఫోన్ చేసి 'జాను' చేయనని చెప్పేదాన్ని. నా మాటలు విని మా మేనేజర్ భయపడిపోయారు. 'మేడమ్.. నాకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నారు' అని అనేవారు.(నవ్వులు)
శర్వానంద్: ఇప్పటికీ మా ఇద్దరిలో చాలా భయం ఉంది. టీజర్, ట్రైలర్లు వచ్చినప్పుడు మా గురించి ఎలాంటి ట్రోల్స్ వస్తాయో అని భయపడ్డాం.
'96' సినిమాలో త్రిష పేరు 'జాను'. ఆ సినిమాలో ఆ పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. అలా మీరు ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారా?
శర్వానంద్:త్రిష, విజయ్ సేతుపతి చాలా పెద్ద స్టార్స్. '96' సినిమాలో వాళ్లిద్దరూ చక్కగా నటించారు. కెరీర్ పరంగా చూసుకుంటే వాళ్లు మాకంటే పదేళ్లు ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'జాను' సినిమాని చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించాం. ఈ కథ నవతరానికి సంబంధించిన స్టోరీ. మా సినిమాలో స్కూల్ రీయూనియన్‌లో కలిసేది 96 బ్యాచ్ కాదు. 2004 బ్యాచ్. అలా చూసుకున్నా మాది కొంచెం యంగ్ జనరేషన్‌గా ఉంటుంది.'జాను' సినిమాలో ప్రధానాంశం లవ్. రామ్ మిస్ అయిన జాను. పదో తరగతిలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే వాళ్లు వందలో ఐదుశాతం మంది కూడా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మా సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను.
మీ జీవితంలో ఏమైనా ప్రేమకథలు ఉన్నాయా?
శర్వానంద్: అలాంటి ఏం లేవు.
సమంత: బోరింగ్ అనే పదంలో క్యాపిటల్ 'బి' అనే లెటర్ శర్వాకు కరెక్ట్‌గా సెట్ అయ్యింది. ఒక లవ్ స్టోరీ లేదు. ఒక లవ్ లేదు.
మీరు అన్నీ సినిమాల్లో డైలాగులను చాలా ఫీల్ అయ్యి మరి చెబుతారు కదా..! నిజంగానే ప్రేమకథలు లేవా?
సమంత: నాకు అదే అనిపించింది. సినీ పరిశ్రమలో ఉన్న చాలామందికి సంబంధించిన రూమర్స్ వస్తుంటాయి కదా అని చెప్పి ఒకరోజు నేను శర్వానంద్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశాను. కానీ ఏం రాలేదు.
ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?
శర్వానంద్: ఇప్పటివరకూ నాకు ప్రేమకథలు లేవు. కానీ నేను 'మజిలీ' సినిమాలో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. భర్త ఏం చేసినా తను చాలా సైలెంట్‌గా ఉంటుంది. భర్తను బాగా చూసుకుంటుంది.