హిందీ చిత్రసీమలో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న కథానాయిక విద్యాబాలన్. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించిన ఈ భామ... త్వరలో ప్రముఖ గణితశాస్త్రవేత్త, భారతీయ మహిళ శకుంతలాదేవి పాత్రలో కనిపించనుంది. అక్టోబర్‌లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అను మీనన్ దర్శకుడు. అంబుదతియా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది చిత్రబృందం.
ఎవరీ శకుంతల...?
శకుంతలను ప్రపంచమంతా నడిచే కంప్యూటర్‌గా చెబుతుంటారు. శకుంతల తన ఐదవ ఏటనే 18 ఏళ్ల వయసుగల పిల్లలకు లెక్కలు చెప్పేది. అటువంటి మేధావి అయిన ఆమె... ఎక్కడా అధికారికంగా విద్యనభ్యసించలేదు. ఆమె 1982లో గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు సాధించింది.
విద్యాబాలన్ ఇప్పటికే ఓ వెబ్ సిరీస్‌లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి బయోపిక్‌లోనూ నటించనున్నట్లు సమాచారం.
జయలలిత, ఇందిరాగాంధీ, మయావతి ఇటీవల జయలలిత జీవిత చరిత్రలో నటించే ఛాన్స్ కోల్పోయింది విద్యా. 'తలైవి'గా రాబోతున్న ఈ చిత్రంలో కంగనా కథానాయిక. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది ఈ చిత్రం. ఎఎల్ విజయ్ దర్శకుడు. ఈ సినిమాలో అవకాశం చేజారిపోవడంపై మాట్లాడిన విద్యా.."జయలలిత పాత్రలో కంగనా నటించడం సంతోషంగా ఉంది. తొలుత ఆ జీవితచరిత్రలో నటించే అవకాశం నాకే వచ్చింది. అయినా తినే మెతుకుపై ఎవరిపేరు రాసుంటే వారే తింటారు" అని సమాధానమిచ్చింది.