'మణికర్ణిక'.. ఝాన్సీలక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్ కథానాయికగా బాలీవుడ్‌లో తెరకెక్కింది. సినీ ప్రియుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అనుమానాలున్నాయి. వీటిపై తాజాగా దర్శకుడు క్రిష్ స్పందించారు. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో.. ఆయన పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. సోనూసూద్ పోషించిన సదాశివ్ పాత్రను ఫస్ట్ హాఫ్‌లో ముగించమని కంగనా టీమ్ చెప్పడం వల్ల వివాదానికి దారితీసిందని తెలిపారు.
"గతేడాది 'మణికర్ణిక' విడుదలయ్యింది. ఇప్పటివరకూ 'మణికర్ణిక' గురించి నేను పూర్తిగా మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కంగన కూడా ఓ ట్వీట్ పెట్టారు. ఇప్పుడు నేను కూర్చున్న ఈ స్థానంలోనే 'మణికర్ణిక' మూవీ పూజా కార్యక్రమం అప్పట్లో నిర్వహించాం. దాదాపు 25 రోజులపాటు ఇక్కడే షూటింగ్ చేశాం. నిజం చెప్పాలంటే, 91 రోజుల్లో మేమంతా ఎంతో సంతోషంగా 'మణికర్ణిక' షూట్ పూర్తి చేశాం. కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. షూట్ అంతా ఎంతో సంతోషంగా గడిచింది. రీరికార్డింగ్ జరుగుతున్న సమయంలో కంగన టీమ్ సినిమా చూశారు. ఫస్ట్ హాఫ్ వాళ్లకి బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా బాగుందని చెప్పారు.
కొన్నిరోజులు గడిచిన తర్వాత కంగన టీమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలేదని చెప్పారు. నేను షూట్ చేసిన దాని ప్రకారం సోనూసూద్ పోషించిన 'సదాశివ్' పాత్ర సెకండ్ హాఫ్‌లో చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. కానీ అది వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్‌హాఫ్‌తోనే ముగించమని చెప్పారు. అది నా వల్ల కాదని ఎందుకంటే 'మణికర్ణిక' ఒక చారిత్రాత్మక చిత్రమని చెప్పాను.