తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే అక్కినేని నాగేశ్వరరావు గొప్పవారు!

నాలుగో తరగతి మాత్రమే చదివిన వ్యక్తి.. దశాబ్దాలుగా అగ్రహీరోగా కొనసాగుతూ, పోటీని తట్టుకొంటూ అవసరమైన చోట సముచిత లౌక్యాన్ని ప్రదర్శిస్తూ, తుదిశ్వాస వరకూ బ్యాలెన్స్‌డ్‌గా జీవించటం అనేది అతి కొద్దిమందికే సాధ్యం. వారిలో అగ్రతాంబూలం అక్కినేని నాగేశ్వరరావుకే. ఇంతటి గొప్ప వ్యక్తి వర్థంతి నేడు (జనవరి 22న). ఈ సందర్భంగా ఏఎన్​ఆర్ గురించి ప్రత్యేక కథనం.

akkineni nageswarrao is considered one of the greatest and most successful actor in Indian cinema and one of the pillar of Telugu Cinema
అందుకే అక్కినేని... గొప్పవాడు

By

Published : Jan 22, 2020, 1:55 PM IST

Updated : Feb 17, 2020, 11:40 PM IST

'నేను ఎవరిని? అని ప్రతి ఒక్కరూ తనను తాను ప్రశ్నించుకొని తెలుసుకొనే ప్రయత్నం చేయమన్నారు రమణ మహర్షి. ఈ అనంతకోటి బ్రహ్మాండ రాశిలో నీవెవరో, నీ స్థానం ఎక్కడో, ఎక్కడ నుంచి వచ్చావో, ఎక్కడికి పోతావో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మోక్షం వస్తుందో రాదోగానీ వినయం వస్తుంది. 'విర్రవీగటం పోయి ఎంత ఎదిగినా ఒదిగి వుండే' సులక్షణం అబ్బుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఈ బాటను అనుసరించి చిరస్మరణీయులైన మహానుభావులు ఎందరో ఉన్నారు. అయితే అనేక ప్రలోభాలకు, ఆకర్షణలకు అన్ని వికారాలకు సుఖలాలసకూ తావైన సినిమా రంగంలోని వ్యక్తి తనను తాను తెలుసుకొనే ప్రయత్నం చేయడం అరుదైన విషయం. మరి ఈ జాబితాకు చెందిన వ్యక్తే దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు​.

అందుకే అక్కినేని... గొప్పవాడు

చదువు కొనసాగించలేక.. నాటకాలు
ఏఎన్​ఆర్.. చిన్న వయసులో చదువు కొనసాగించలేక, నాటకాల్లో నటించారు. వాటిలోనూ మహిళా పాత్రలే ఎక్కువ. అప్పటికి తెలుగు సినిమా పురుడు పోసుకొని పదేళ్లు కావస్తోంది. చిత్తూరు నాగయ్య, సి.హెచ్‌.నారాయణరావులు హీరోలుగా సినిమా రంగాన్ని ఏలుతున్న రోజులలో అక్కినేని తెరంగేట్రం జరిగింది. బక్కపలుచని శరీరం, పీలగొంతుక, కేవలం నాలుగో తరగతి వరకూ చదివిన వానాకాలం చదువు అక్కినేని తన స్థాయి ఏమిటో తను తెలుసుకొనేటట్లు చేశాయి.

చన్నీటి కుండతో సాధన
అప్పట్లో ఎవరి పాటలు వారే పాడుకొనే పరిస్థితి. నేపథ్యగానం ఇంకా నెలకొనలేదు. గాత్రశుద్ధి కోసం చన్నీటికుండ తో సాధన చేశారు అక్కినేని. ఆ నాటి దిగ్గజాల మధ్య మసలుతూ ఎన్నో నేర్చుకొన్నారు. నటుడిగా, వ్యక్తిగా తను ఆటగాడిని మాత్రమేనని పాటగాడిని కాదని గ్రహించారు. చిత్ర రంగానికి రాకముందే పరిచయమున్న ఘంటసాలను తనకు నేపథ్యగాయకుడిగా ఎన్నుకొన్నారు అక్కినేని. కీలుగుర్రమెక్కి 'బాలరాజు'లా పల్నాటి బాలచంద్రుడిలా విజృంభించారు. ఓ లైలా కోసం 'మజ్ను' అయ్యారు. జానపద హీరోగానే కాకుండా విషాదాంతక పాత్రలకూ పనికొస్తాడనిపించుకొన్నారు. ఆ తరుణంలో ఎన్టీఆర్‌ ప్రవేశం జరిగింది.

అందుకే అక్కినేని... గొప్పవాడు

ఎన్టీఆర్​ అక్కినేనిని ఆలోచనలో పడేశారు
అందాల రాజకుమారుడిగా, చిలిపి కృష్ణుడిగా ఏ పాత్రకైనా సరిపడే ఆహార్యం గల నందమూరి, అక్కినేనిని మరలా ఆలోచనలో పడేశారు. ఆ పాత్రలకు తాను తగనని గ్రహించారు అక్కినేని. ఫలితం సుమారు పది సంవత్సరాలు జానపద కథానాయకుడిగా వెలిగాక తొలిసారిగా సాంఘికం 'సంసారం'లో నటించారు. అలా ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకొంటూ విజయాల నుంచి, పరాజయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ప్రలోభాలకు వ్యసనాలకులోనై బంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకొన్న ఎందరో నటీనటుల జీవితాలను పరికిస్తూ, తనను తాను తీర్చిదిద్దుకొన్నారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించి చలనచిత్ర రంగపు అత్యుత్తమ అవార్డు 'పద్మభూషణ్‌'ను పొందారు. 72 ఏళ్ల సుదీర్ఘ సినీ నటజీవితాన్ని తాను కోరుకున్నట్లుగా నటిస్తూనే ముగించటం కోసం ఆఖరి చిత్రం 'మనం'కు డబ్బింగ్‌ బెడ్‌ మీద నుంచే చెప్పి పైలోకాలకు భౌతికంగా, అభిమానుల గుండెల్లోకి శాశ్వతంగా తరిలిపోయిన అక్కినేని ఓ పరిపూర్ణ నటుడు, వ్యక్తి, ఓ లెజెండ్‌. ఆయనలోని, ఆయనకే సాధ్యమైన కొన్ని ప్రత్యేకతలను చూద్దాం.

సమతౌల్యం (బ్యాలెన్స్‌)

అందుకే అక్కినేని... గొప్పవాడు
తొలి నుంచి తుది వరకు సహజ నటుడు. నటనలో డ్రామా ఉండదు. ఓవర్‌ యాక్టింగ్‌ చాలా తక్కువ. పాత్రను బాగా అర్థం చేసుకొని అండర్‌ప్లే చేస్తారు. దానితో సహజత్వం వచ్చేస్తుంది.
వాచకం
సుస్పష్టమైన వాచకం. ఎటువంటి సన్నివేశంలోనైనా ఎంతటి ఉద్వేగాన్ని చూపించాల్సి వచ్చినా, తాగుబోతుగా తడబడినా సృష్టత పోదు.
లిప్‌ మూవ్‌మెంట్‌
అందుకే అక్కినేని... గొప్పవాడు
గాత్ర శుద్ధి కోసం సాధన చేసిన వాడవటం, తొలినాళ్లలో తానే పాడుకోవలసి రావడం వల్ల పాటమీద పట్టు బాగా ఉంది. నేపథ్యంలోని ఘంటసాలకు దీటుగా సరిగ్గా లిప్‌ మూవ్‌మెంట్‌ ఇస్తారు. ఏ వెరీ పర్‌ఫెక్ట్‌ సింక్రనైజేషన్‌. 'జయభేరి' చిత్రంలోని 'మది శారదాదేవి మందిరమే', 'రసికరాజ తగువారము కామా’' పాటలలో ఆయన పెదాల కదలికలను గమనించండి. ప్రక్కనున్న వాయిద్యకారులకు అనుగుణంగా తల ఊపుతూ పాడిన తీరు అద్భుతం. అందుకే ఘంటసాల అక్కినేని కాంబినేషన్‌ ఓ అపూర్వమైనదిగా నిలిచిపోయింది.

చిత్రాల ఎంపిక

అందుకే అక్కినేని... గొప్పవాడు
అక్కినేని నాగేశ్వరరావు.. కుటుంబ కథాచిత్రాలకు పెట్టింది పేరు. కథాబలం ఉంటేనే చిత్రాన్ని ఒప్పుకునేవారు. ఎంత డిమాండ్‌ ఉన్నప్పటికీ సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలే చేసేవారు. తొలి నవలా హీరో ఆయనే. తెలుగులోనే కాకుండా బెంగాలీ సాహిత్యం ఆధారంగా ఆయనే నాయకుడిగా ఎన్నో సినిమాలు వచ్చాయి. పాత్రల, కథా చర్చలలో పాల్గొనేవారు.
విజయ శాతం
ఆచితూచి చిత్రాలను ఎన్నుకోవడం వల్ల పరాజయాలు చాలా తక్కువ. తెలుగు తమిళ, హిందీ సినిమాలు ఆయనవి సుమారుగా 256 ఉంటాయి. వాటిలో పరాజయం పొందినవి చాలా తక్కువ. మొత్తం సంఖ్య, విజయం సాధించిన వాటి సంఖ్య నిష్పత్తి తీస్తే ఆయన చిత్రాల విజయశాతం మిగిలిన నటుల చిత్రాల కన్నా చాలా ఎక్కువ.

స్టెప్స్‌

అందుకే అక్కినేని... గొప్పవాడు
స్టెప్స్‌కు ఆద్యుడు అక్కినేని. తొలినాళ్లలో ఆడవేషాలు వేసి ఉండటం, పరిశీలనా దృష్టి ఎక్కువగా ఉండటం వలన సుకుమార నాట్యభంగిమలు బాగా వంటబట్టేశాయి. బుచ్చబ్బాయ్‌ పనికావాలోయ్‌ (ప్రేమించి చూడు), అయ్యయ్యో బ్రహ్మయ్య (అదృష్టవంతులు) పాటలకు ప్రేక్షకులు ఈలలేస్తారు. ఇంకా 'బుద్ధిమంతుడు', 'దసరాబుల్లోడు' ఇలా ఎన్నో. ఆదర్శ కుటుంబంలో కోలాటం వేస్తారు. 'అందాల రాముడు' హరికథ భంగిమలు చూడాల్సిందే.

వైవిధ్యం
అక్కినేనిని అమరుడిని చేసింది ఈ లక్షణం. జానపద వీరుడిగా వేసి 'మజ్ను', 'దేవదాసు' వంటి ట్రాజెడీ పాత్రలు వేశాక అక్కడే ఆగిపోకూడదని 'చక్రపాణి', 'మిస్సమ్మ' చిత్రాలలో హాస్యపాత్రలు ఏరికోరి వేయడం ‘లాంగివిటీని’ పెంచింది. 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కృష్ణుడి బదులుగా అర్జునుడిగా, 'చాణక్య చంద్రగుప్త'లో చంద్రగుప్తుడి బదులుగా చాణక్య పాత్రలు వేయడం ఆయన బుద్ధికుశలతను సూచిస్తుంది. ట్రాజెడీ కింగ్‌గా బ్రాండ్‌ పడిపోయింది. ప్రేమికుడిగా తిరుగులేదు. నారదుడిగా, తెనాలి రామకృష్ణుడిగానూ రాణించారు. ట్రాజెడీ కింగ్‌లాంటి బలమైన ముద్ర ఉన్నా, మరలా భక్తి పాత్రలు వేశారు (విప్రనారాయణ, భక్తతుకారం) ఇచ్చారు. భక్త జయదేవ, మహా కవి కాళిదాసు, అమరశిల్పి జక్కన్న వంటి కళాకారులకు సెల్యూలాయిడ్‌ రూపాన్ని ఇచ్చారు. స్వతహాగా నాస్తికుడై ఉండి దేవుడి మీద భక్తిని కురింపించగలగడం అసాధారణ నటుడికే చెల్లుతుంది.

బాధ్యత

అందుకే అక్కినేని... గొప్పవాడు
ఏ పనినైనా బాధ్యతగా చేయడం ముఖ్యం. చెప్పడమే కాకుండా చేసి చూపించటం ముఖ్యం. చిత్రాలకు అవార్డుల ద్వారా వచ్చిన డబ్బుతో ఆదుర్తితో కలిసి 'సుడిగుండాలు', 'మరోప్రపంచం' వంటి సందేశాత్మక చిత్రాలు తీశారు. 'సుడిగుండాలు' సినిమాలో జడ్జిపాత్రలో చెడిపోతున్న యువతపైన ఆవేదనను ఒక సుదీర్ఘ సన్నివేశంలో చూపిన తీరు అమోఘం. అది నటనలా అనిపించదు. సామాజిక బాధ్యత కనిపిస్తుంది. తాను చదువుకోకపోయినా ఇతరులు చదువుకోవటం కోసం విద్యాలయాన్ని స్థాపించటం విశేషం.

కుటుంబం
కీర్తిప్రతిష్టాలు, డబ్బు మైకంలో కుటుంబాన్ని విస్మరించిన ఘనులెందరో. అక్కినేని అలాకాదు. అసలు పిల్లల చదువుకోసమే మద్రాసు నుంచి హైదరాబాద్‌ వచ్చేశారు. నెలలో ఒకరోజు కుటుంబ సభ్యులందరు కలవాలనే రివాజు పెట్టారు. క్రమశిక్షణతో మెలుగుతున్న సినీనటుల కుటుంబాలలో అక్కినేని కుటుంబం మొదటి వరుసలో ఉంటుంది.

పట్టుదల

అందుకే అక్కినేని... గొప్పవాడు
దేనినైనా సాధించాలంటే ముందుగా కావలసినది పట్టుదల. అది ఆయనలో పుష్కలంగా ఉంది. ఆత్మ విమర్శ చేసుకోవడం, తనలో లోపాలేమిటో తెలుసుకోవటం, పట్టుదలతో కృషి చేసి అధికమించటం, పైకి రావాలనుకొనే ప్రతి వ్యక్తి చేయాల్సిందే. మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషరాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆపై పట్టుదలతో నేర్చుకొని ఆనర్గళంగా ఇంగ్లీషులో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారు. ఏ అంశంపైనైనా సరే సంస్కృతాన్ని ఉటంకిస్తూ ప్రసంగించగలరు. తన ఎదుగుదలకు కారణమైన వారందరినీ గుర్తుపెట్టుకోవడం ఆయనలోని మరొక మంచి లక్షణం. గుండె శస్త్రచికిత్స జరిగాక తనలాగ బ్రతికిన వాళ్లు లేరని చెప్పుకొస్తారు. తనకి క్యాన్సర్‌ అని తెలిసినపుడు ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకటించడం ఆయనకే చెల్లింది. క్యాన్సర్‌ను జయిస్తానని, పెద్దలలో క్యాన్సర్‌ అంత సులభంగా వ్యాపించదని, తన మాతృమూర్తిలా తాను 96 సంవత్సరాలు బ్రతుకుతానని ప్రకటించారు. కానీ ఆయన నమ్మని దేవుడు ఆయనను, తన ఉనికిని చూపడానికి తీసుకుపోయాడు. భగవంతుడనేవాడుంటే మనిషిని మనిషిలా బ్రతకమనే చెబుతాడని చెప్పే అక్కినేని, నాలుగో తరగతిని పాఠశాలలోనూ, జీవితాన్ని ప్రపంచంలోనూ చదివారు. అతని కన్నా బాగా చదువుకున్న ఎంతో మంది కళాకారులలో లేని పరిణితి అక్కినేనిలో కనిపిస్తుంది.

ఇదీ చదవండి:ఆ వార్తలు అవాస్తవం: ఆలియా భట్

Last Updated : Feb 17, 2020, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details