దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'పటాస్'. 'అడిమురై' అనే వర్మకళ(మార్షల్ ఆర్ట్స్) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి అర్ధ భాగం కన్నా 'అడిమురై'కి సంబంధించి వచ్చిన ఫ్లాష్ బ్యాక్‌తో ఉన్న ద్వితీయార్థం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు స్నేహ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో 'అడిమురై' నేర్చుకునే విద్యార్థినిగా, గురువుగా ఆమె నటించింది. ఇందుకోసం దాదాపు మూడు నెలల పాటు ఆమె శిక్షణ తీసుకున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఎంతో క్లిష్టమైన ఈ వర్మ కళను ఆమె నేర్చుకుని నటించింది.
గర్భిణిగానే...
ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న తర్వాత స్నేహ గర్భం దాల్చింది. అయినప్పటికీ ఇంట్లోనే శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా కథ ప్రకారం చెన్నైలోని గిండి ఫ్లైఓవర్ వద్ద పోరాట సన్నివేశంలో ఆమె అడిమురై కళను ప్రయోగిస్తారు. అప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిణి. అయినప్పటికీ వైద్యుల సలహాల మేరకు ఆ సన్నివేశంలో నటించి మెప్పించింది. ఆ సమయంలో ఆమె సాహసాన్ని చూసి ఆశ్చర్చపోయిందట చిత్ర బృందం. అంతేకాకుండా ఆ సన్నివేశాన్ని తెరకెక్కించే వరకు దర్శకుడి నుంచి టెక్నీషియన్ల వరకు అందరూ భయంతో వణికిపోయారట.
షూటింగ్ సమయంలో స్నేహ భర్త ప్రసన్న అనుక్షణం తోడుగా ఉంటూ తమకు ఎంతో సహకరించారని దర్శకుడు దురై సెంథిల్ కుమార్ పేర్కొన్నాడు. గతేడాది అక్టోబర్ 3న స్నేహ శ్రీమంతం జరిగింది. సినిమా విడుదలయ్యాక నటి స్నేహ అడిమురైలో శిక్షణ పొందిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి...రెండోసారి తల్లి కాబోతోంది నటి స్నేహ