దక్షిణాది ప్రముఖ నటి స్నేహ రెండోసారి తల్లి కాబోతోంది. ఆమెకు గురువారం సీమంతం వేడుకను నిర్వహించారు కుటుంబసభ్యులు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
2009లో స్నేహ, తమిళ నటుడు ప్రసన్న ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ 2012, మే11న ఒక్కటయ్యారు. 2015లో విహాన్ అనే బాబు పుట్టాడు.
హిందీ నుంచి దక్షిణాదికి...
1981లో మహారాష్ట్రలో పుట్టిన సుహాసిని రాజారామ్ అలియాస్ స్నేహ.. 2001లో విడుదలైన 'తొలి వలపు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అదే ఏడాది తరుణ్ హీరోగా తెరకెక్కిన 'ప్రియమైన నీకు'లో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె 'హనుమాన్ జంక్షన్', 'సంక్రాంతి', 'వెంకీ', 'రాధాగోపాలం', 'శ్రీరామదాసు' చిత్రాల్లో నటించింది. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి.. 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. చివరిగా 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది.
ఇటీవల కన్నడ చిత్రం మునిరత్న కురుక్షేత్రలో నటించింది. ప్రస్తుతం హీరో అరుణ్ విజయ్, దర్శకుడు కార్తీక్ నరెన్ కాంబినేషన్లో వస్తోన్న 'మాఫియా'లో కనిపించనుంది. కోలీవుడ్లో పటాస్, వాన్ చిత్రాలతో బిజీగా ఉందీ నటి.