WhatsApp Multi Account Feature : మీ ఫోన్లో రెండు సిమ్‌కార్డులు ఉన్నాయా? కానీ ఆ రెండు నంబర్లతో ఒకేసారి వాట్సాప్ వాడలేకపోతున్నారా? ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ త్వరలోనే 'మల్టీ అకౌంట్ ఫీచర్'ను తీసుకురానుంది. ప్రస్తుతం ఒకే ఫోన్లో రెండు నెంబర్లతో వాట్సాప్ వాడాలంటే.. ఒకటి క్లోనింగ్ యాప్ అయినా వాడాలి. లేదంటే బిజినెస్ యాప్ అయినా ఉండాలి. ఇది యూజర్లకు కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. అలా కాకుండా వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకునే వీలు ఉంటే, ఎంత బాగుంటుందో కదా! సరిగ్గా వాట్సాప్ కూడా ఇదే పని చేస్తోంది. ఒకే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు (మల్టీ అకౌంట్స్) వాడుకునే సదుపాయాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
లేటెస్ట్ వెర్షన్లో..
Whatapp new update : వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.13.5లో ఈ 'మల్టీ అకౌంట్' ఫీచర్ కనిపించింది. వాస్తవానికి వాట్సాప్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చే.. 'వాట్సాప్‌బీటా ఇన్ఫో' ఈ సరికొత్త ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కనిపించింది. కానీ త్వరలోనే రెగ్యులర్ వాట్సాప్ యాప్‌లో కూడా ఈ ఫీచర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.