రేడియో, పోడ్‌కాస్ట్ యాప్‌లకు పెద్ద కాన్ఫిగరేషన్స్ అక్కర్లేదు. వీటి కోసమూ పాత పరికరాలు ఉపయోగ పడతాయి. స్మార్ట్‌ఫోన్లు కావొచ్చు, ట్యాబెట్లు కావొచ్చు. ఏటా కొత్తరకంగా పలకరిస్తూనే ఉంటాయి. వినూత్న ఫీచర్లతో ఊరిస్తూనే ఉంటాయి. మనసెలా ఊరుకుంటుంది? ఏమైనా సరే వెంటనే కొనేస్తాం. మరి పాత పరికరాన్ని ఏం చేయాలి? ఇక్కడే పెద్ద సందేహం పుట్టుకొస్తుంది. ఇతరులకు ఇవ్వచ్చు. కావాలంటే అమ్మొచ్చు. రీసైక్లింగ్‌కు ఇవ్వచ్చు. అంతేనా? మనసు పెట్టి ఆలోచిస్తే కాలం చెల్లిన హార్డ్‌వేర్‌తో కూడిన పాత పరికరాలనైనా ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. అదీ అదనంగా ఎక్కువ ఖర్చు పెట్టకుండానే. అలాంటి ఉపాయాల్లో కొన్ని ఇవీ..
మల్టీమీడియా పరికరంగా..
వంటింట్లోనో, ఆఫీసు గదిలోనో మరో టీవీని పెట్టుకోవాలని అనుకుంటున్నారా? టీవీ ప్రొవైడర్‌కో, స్ట్రీమింగ్ సర్వీసుకో చందా కట్టి ఉన్నట్టయితే పాత ఫోన్, ట్యాబ్లెట్‌నే టీవీగా మార్చుకోవచ్చు. టీవీ ప్రొవైడర్ లేదా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సర్వీసు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటే సరి. ఎంచక్కా నచ్చిన కార్యక్రమాలు, సినిమాలు అక్కడే చూసుకోవచ్చు. పాత పరికరాల్లో బ్యాటరీ త్వరగా నిండుకుంటుంది కాబట్టి విద్యుత్తు ప్లగ్ దగ్గరే పెట్టుకోవటం మంచిది. ఒకపక్క ఛార్జింగ్ అవుతూనే మరోవైపు వీడియోలు చూపిస్తుంది. కావాలంటే స్పీకర్ క్రాడిల్‌లోనూ పెట్టుకోవచ్చు. ఇదీ పరికరాన్ని ఛార్జ్ చేస్తుంది. ఇలా అంతరాయం లేకుండా సంగీతం, పోడ్‌క్యాస్ట్‌ల వంటివీ వినొచ్చు. బ్లూటూత్ స్పీకర్‌తో అనుసంధానం చేసుకున్నా మేలే. పాత ట్యాబ్లెట్లను ప్రత్యేకించి ఇ-బుక్ రీడర్లుగానూ వాడుకోవచ్చు. అంతేకాదు.. ఛార్జర్‌కు కనెక్ట్ చేసి డిజిటల్ ఫొటో ఫ్రేమ్‌గానూ ఉపయోగించుకోవచ్చు.
సార్వత్రిక రిమోట్‌గా..
స్మార్ట్ హోం ఉపకరణాలు, మ్యూజిక్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కనెక్టెడ్ టీవీల వంటి పరికరాలను ఇప్పుడు యాప్స్‌తోనే కంట్రోల్ చేసే వీలుంది. మరి పాత ఫోన్, ట్యాబ్లెట్‌ను వీటన్నింటికీ ఉపయోగపడే రిమోట్ కంట్రోల్‌గా మార్చుకుంటే పోలా? ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్‌లు చాలానే ఉన్నాయి గానీ అమెజాన్, యాపిల్, గూగుల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, సామ్‌సంగ్ వంటి సంస్థలు సొంత ప్రోగ్రామ్‌లతోనే పనిచేస్తాయి. ఆయా పరికరాల హార్డ్‌వేర్‌కు సరిపడిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. నట్టింటి నుంచే అన్ని పరికరాలనూ ఓ కంట కనిపెట్టొచ్చు. లైట్లు, స్మార్ట్ ప్లగ్‌లు, స్పీకర్లు, థర్మోస్టాట్స్.. చివరికి వ్యాక్యూమ్ క్లీనర్ల వంటి వాటిని దూరం నుంచే కంట్రోల్ చేయటానికి గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ హోం, ఓలిస్టో, ఐహాస్, స్మార్ట్‌థింగ్స్, యోనోమి, ఐఎఫ్‌టీటీటీ. హోం రిమోట్.. ఇలా చెప్పుకొంటూ పోతే వీటి జాబితాకు అంతే లేదు. ఐఓస్ పరికరాల కోసం యాపిల్ టీవీ, ఐట్యూన్స్ రిమోట్ యాప్‌లు ప్రయత్నించొచ్చు.
గేమింగ్ కోసం..
ప్రాసెసర్, బ్యాటరీ పరిస్థితిని బట్టి పాత పరికరాన్ని గేమింగ్ ఉపకరణంగానూ వాడుకోవచ్చు. ముందే మొత్తం డేటాను తొలగిస్తే మరిన్ని గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకోవటానికి, స్టోర్ చేసుకోవటానికి తగిన స్పేస్ లభిస్తుంది. మొబైల్ గేమింగ్‌కు అనుగుణంగా మార్చిన పాత గేమ్స్ యాప్‌స్టోర్‌లో చాలానే ఉన్నాయి. అలాగని వీటికే పరిమితం కావాల్సిన పనిలేదు. యాపిల్ ఆర్కేడ్, గూగుల్ స్టేడియా వంటి సబ్‌స్క్రిప్షన్ సర్వీసులు చాలా మొబైల్ పరికరాల్లో పనిచేస్తాయి. గూగుల్ క్రోమ్‌కాస్ట్ గేమ్ మోడ్ లేదా ఎయిర్‌ప్లే టెక్నాలజీ ద్వారానైతే టీవీల వంటి పెద్ద స్క్రీన్‌ల మీదా గేమ్స్ ఆడుకోవచ్చు. పాత ఫోన్‌కు రేజర్ కిషి వంటి ప్రత్యేక కంట్రోలర్లను అమర్చితే వేళ్లతో బటన్లను నొక్కుతూ తేలికగా ఆడుకోవచ్చు.
అటు వినోదం.. ఇటు విజ్ఞానం
పాత ఫోన్, ట్యాబ్లెట్‌లను పిల్లల చదువుల కోసమూ వాడుకోవచ్చు. గేమ్స్, ఎడ్యుకేషనల్ యాప్స్‌ను ఉపయోగించుకోవటాన్ని పిల్లలు బాగానే నేర్చుకున్నారని భావిస్తే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సెటింగ్స్‌లోకి వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించేయాలి. పిల్లల, పెద్దల భద్రతకు ఇది ఎంతైనా అవసరం. తర్వాత పిల్లల కోసం విడిగా అకౌంట్ తెరవాలి. పేరెంటల్ కంట్రోల్స్‌ను కన్ఫిగర్ చేసుకోవాలి. దీంతో పరికరాలను వాడే సమయం, యాప్ కొనుగోలు, ఇంటర్నెట్ యాక్సెస్ వంటి వాటిని నియంతించొచ్చు. ఒకవేళ ఫోన్ కెమెరా ఇంకా పనిచేస్తున్నట్టయితే, ఎక్కువసేపు ఛార్జింగ్ ఉంటున్నట్టయితే ఫొటోగ్రఫీలో పిల్లలకు పాఠాలు బోధించొచ్చు. పిల్లల యాప్‌స్టోర్ ఖాతాకు ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డును జతచేస్తే మనీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలూ అలవడతాయి. గంటలోపే ఛార్జింగ్ నిండుకునేట్టయితే కాలం విలువను, కాలాన్ని సద్వినియోగం చేసుకోవటాన్నీ పరోక్షంగా నేర్పించినట్టూ అవుతుంది.